రాజస్థాన్ ప్రైవేట్ లాకర్ల సోదాలో భారీ నగదు

రాజస్థాన్ ప్రైవేట్ లాకర్ల సోదాలో భారీ నగదు

రాజస్థాన్‌లో శుక్రవారం ఆదాయపు పన్ను శాఖ పంజా విసిరింది. ఐటికి చెందిన ప్రత్యేక బృందం తమకు ఓ బిజెపి ఎంపి నుంచి అందిన బ్లాక్‌మనీ సమాచారంతో రంగంలోకి దిగింది. జైపూర్‌లోని గణపతి ప్లాజా ప్రైవేట్ లాకర్స్ సోదాకు దిగింది. వీటిలో కోట్లాది రూపాయల నల్లధనం భద్రపర్చారని ఐటి విభాగానికి ఫిర్యాదులు అందాయి. 

కాంగ్రెస్ ఏలుబడిలోని రాజస్థాన్‌లో టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కామ్ డబ్బుకు ఈ లాకర్లకు లింక్ ఉందని ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ఐటి దాడులు ఎన్నికల దశలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇప్పుడు ఐటి బృందం ప్రైవేటు లాకర్ల సోదాలో తలమునకలు అయింది.  ఇప్పటివరకూ కనీసం రూ 7.5 కోట్ల వరకూ లెక్కల్లోకి రాని నగదును కేవలం ఒక్క లాకర్ నుంచి స్వాధీనం చేసుకుంది.

ఇక మరో లాకర్‌లో నోట్లకట్టలతో ఉన్న పెద్ద సంచీని కనుగొన్నారు. ఇందులోని మొత్తాన్ని ఇప్పుడు లెక్కిస్తున్నారని అధికారులు తెలిపారు.  రాజస్థాన్‌లో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరు జోరందుకుంది. ఈ దశలోనే గత నెలలోబిజెపి నేత కిరోరి లాల్ మీనా ఈ బ్లాక్‌మనీ గురించి ఫిర్యాదు చేశారు. సుమారు 100 ప్రైవేట్ లాకర్లలో రూ 500 కోట్ల నల్లధనం, 50 కిలోల బంగారం ఉన్నట్లు ఆయన ఆరోపిస్తున్నారు.

ఇప్పటి వరకు భారీ స్థాయిలో కరెన్సీని, 12 కిలోల బంగారాన్ని స్వాధీనపర్చుకున్నట్లు ఐటి అధికారులు నిర్థారించారు. ఈ ప్లాజాలో దాదాపు 1,100 లాకర్లు ఉన్నాయి. వీటన్నింటిని తెరిస్తే లెక్కలు తేలితే మొత్తం మీద ఎంత మేరకు నల్లడబ్బు ఉందనేది వెల్లడికానుంది. అయితే ఈ లాకర్లు ఏ పార్టీకి చెందిన నేతవి, వీటి వివరాలు ఏమిటనేది వెల్లడికాలేదు.

లాకర్ల వివాదం రాజస్థాన్‌ రాజకీయాల్లో కలకలం రేపుతుండగా, దీనికి ఆజ్యం పోస్తూ కరెన్సీ నోట్లను కప్పి ఉంచే కవర్లు, బ్యాంకు లావాదేవీల రసీదులు జైపూర్‌లోని ఓ చెత్తకుప్పలో ఇటీవల పెద్దయెత్తున వెలుగు చూడటం మరింత వివాదాన్ని రాజేసింది.  ఎన్నికల్లో పంచేందుకే కాంగ్రెస్‌ ఈ కోట్లకట్టలను సిద్ధంచేసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాగా కర్ణాటకలో కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు కీలక నేతల సన్నిహితుల ఇండ్లలో ఇటీవల దాదాపు రూ. 80 కోట్ల నోట్ల కట్టలను అక్కడి ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.