ప్రతి మొబైల్ యూజర్ కు ప్రత్యేక గుర్తింపు సంఖ్య!

టెక్నాలజీని బాగా సద్వినియోగం చేసుకుంటూ ప్రజల జీవితాలను సులభతరం చేసే విధంగా ప్రతి భారతీయుడి గోప్యత, భద్రతలను మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా దేశంలోని ప్రతి మొబైల్ యూజర్‌ కు యూనిక్‌ ఐడెంటిఫికేషన్ నంబర్‌ ను కేటాయించే కొత్త విధానాన్ని ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. 

ఈ నంబర్ మొబైల్ కనెక్షన్లు గల వ్యక్తులకు డిజిటల్ ఐడెంటిటీ కార్డుగా పని చేస్తుంది. ఇది ఫోన్ యూసేజ్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని స్టోర్ చేస్తుంది.  ఒక యూజర్‌కు ఎన్ని ఫోన్లు ఉన్నాయి? ఒక యూజర్‌కు ఎన్ని సిమ్ కార్డ్‌లు ఉన్నాయి? ఏ సిమ్ కార్డ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయి, ఏవి ఇన్‌యాక్టివ్‌గా ఉన్నాయి? 

యూజర్ పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్‌లు నమోదు అయ్యాయి? వంటి వివరాలన్నిటినీ యూనిట్ ఐడీ నంబర్ స్టోర్ చేస్తుంది. ఈ ఐడీలను కేటాయించే కొత్త విధానంతో అధికారులు, యూజర్లు కావాల్సిన సమాచారాన్ని సులభంగా కనుగొనవచ్చు. ఈ కొత్త వ్యవస్థ మొత్తం సమాచారానికి కేంద్ర భాండాగారంగా ఉంటుంది.

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్ (ఎబిహెచ్ఎ) అనేది ఒక వ్యక్తి మెడికల్ హిస్టరీకి డిజిటల్ రికార్డ్‌ను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రోగ్రామ్‌. డాక్టర్లు ఈ నంబర్ ద్వారా రోగి మునుపటి హెల్త్ డేటాను ఈజీగా యక్సెస్ చేయవచ్చు. దీనితో పాత మెడికల్ రికార్డులను తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. 

అదేవిధంగా, మొబైల్ యూజర్ కోసం అందించే యూనిక్ ఐడి నంబర్ ఫోన్ యూసేజ్ హిస్టరీ మొత్తం స్టోర్ చేస్తుంది. అదొక డిజిటల్ ఆర్కైవ్‌గా పని చేస్తుంది. యూసేజ్ హిస్టరీ మొత్తం కొన్ని క్లిక్కులతో యాక్సెస్ చేయడం కుదురుతుంది. యూనిక్ ఐడి  నంబర్ సిస్టమ్ మొబైల్ యూజర్ల డిజిటల్ భద్రతను మెరుగు పరుస్తుంది. 

దీనితో ఫేక్ లేదా చట్టవిరుద్ధమైన సిమ్ కార్డ్‌ల వినియోగాన్ని, హానికరమైన ప్రయోజనాల కోసం సిమ్ కార్డ్‌లను పెద్దమొత్తంలో కొనుగోలు చేయడాన్ని అధికారులు గుర్తించి నిరోధించవచ్చు. ఇది నిర్దిష్ట వినియోగదారుతో అసోసియేట్ అయిన సిమ్ కార్డును ట్రాక్ చేయడాన్ని కూడా సులభతరం చేస్తుంది. యూజర్లు కొత్త మొబైల్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు యూనిక్  ఐడినంబర్‌ను అందుకుంటారు. కొత్త సిమ్ కార్డును కొనుగోలు చేసేటప్పుడు ఉద్దేశించిన యూజర్ వివరాలను కూడా అందించాలి.