మణిపూర్ లో ఐదుగురు కుకీలు అపహరణ

మణిపూర్‌లోని కుకీ కమ్యూనిటీకి చెందిన ఐదుగురు సభ్యులను కిడ్నాప్‌కు గురైనట్లు అధికారులు బుధవారం తెలిపారు. కుకీల ఆధిపత్యం అధికంగా ఉండే కాంగ్‌పోక్సీ మరియు మైతేయిల ఆధిపత్యం అధికంగా ఉండే ఇంఫాల్‌ పశ్చిమజిల్లా సరిహద్దుల్లో ఉన్న కాంగ్‌చుప్‌ చింఖోంగ్‌కు సమీపంలో మంగళవారం ఉదయం 8.45 గంటలకు సాయుధ దుండగులు వారిని కిడ్నాప్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. 

వీరిలో నలుగురు సైనికుని కుటుంబ సభ్యులుగా గుర్తించారు. కాంగ్‌చుప్‌ చింఖోంగ్‌ గ్రామంలోని చెక్‌పోస్ట్‌ వద్ద బొలెరోను ఆపామని, కారులో ఐదుగురు వ్యక్తులు ఉన్నట్లు భద్రతా దళాలు తెలిపాయి. వెంటనే కిడ్నాపర్లపై కాల్పులు చేపట్టామని అయితే ఒకరిని మాత్రమే రక్షించగలిగినట్లు పేర్కొన్నాయి.  ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు సహా తొమ్మిది మందికి గాయాలయ్యాయి.

కిడ్నాపర్ల చెర నుండి రక్షించిన మంగ్లున్‌హోకిప్‌ (65)కి కూడా తీవ్రగాయాలయ్యాయని, అతనిని లిమాఖోంగ్‌లోని సైనిక ఆస్పత్రిలో చేర్చిటనట్లు వెల్లడించారు. ఇతరుల ఆచూకీ లభించలేదని పేర్కొన్నారు.  అయితే హోకిప్‌ చనిపోయినట్లు భావించిన దుండగులు విడిచిపెట్టి పారిపోయారని తెలిపారు. కిడ్నాప్‌ అయిన వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారని కుకీ కమ్యూనిటీ తెలిపింది. వారిని విడింపించేందుకు అవసరమైన సహాయకచర్యలు చేపట్టాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. కిడ్నాప్‌ గురైన వ్యక్తుల గురించి భయపడుతున్నామని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇలా ఉండగా, మ‌ణిపూర్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం మొబైల్ ఇంట‌ర్నెట్ నిషేధాన్ని న‌వంబ‌ర్ 13వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇటీవ‌ల జ‌రిగిన కాల్పుల్లో 10 మంది గాయ‌ప‌డిన నేప‌థ్యంలో మొబైల్ ఇంట‌ర్నెట్‌పై నిషేధాన్ని పొడిగిస్తున్న‌ట్లు ఉత్త‌ర్వులు జారీ చేసింది.  బిష్ణూపూర్, ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, కాంగ్‌పోక్పి జిల్లాలో రెండు క‌మ్యూనిటీల మ‌ధ్య కాల్పులు జ‌రుగుతున్నాయ‌ని మ‌ణిపూర్ డీజీపీ వెల్ల‌డించారు. 
 
మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తులు అదృశ‌మయ్యార‌ని, న‌లుగురు వ్య‌క్తుల‌ను గుర్తు తెలియ‌ని దుండ‌గులు అప‌హ‌రించార‌ని తెలిపారు. దీంతో అక్క‌డ నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయ‌ని పేర్కొన్నారు. హింసను ప్రేరేపించే చిత్రాలు, ద్వేషపూరిత ప్రసంగాలు, వీడియోల‌ను వ్యతిరేక వ్యక్తులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్ర‌చారం చేసే అవ‌కాశం ఉంద‌ని, దాంతో ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని, అందుకే మొబైల్ ఇంట‌ర్నెట్‌పై నిషేధం పొడిగించిన‌ట్లు పేర్కొన్నారు.