అవినీతి కేసులో పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్

రూ. 40 కోట్ల‌కు బ్యాంకును మోసగించిన కేసులో పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే జ‌స్వంత్ సింగ్ గ‌జ్జ‌న్ మ‌జ్రాను ఈడీ అధికారులు సోమ‌వారం అరెస్ట్ చేశారు. బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న ఎమ్మెల్యేను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఆప్ ఎమ్మెల్యేకు ఈడీ గ‌తంలో మూడుసార్లు స‌మ‌న్లు జారీ చేసినా ఆయ‌న ఖాతరు చేయ‌లేదు.

ఎమ్మెల్యే జశ్వంత్‌ సింగ్‌కు చెందిన ఓ కంపెనీపై గతేడాది లూథియానాలోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌ ఒక ఫిర్యాదు చేసింది. ఆ కంపెనీ తమ బ్యాంకు నుంచి రూ.41 కోట్లు తీసుకుని మోసం చేసినట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే బ్యాంక్ ఆఫ్ ఇండియాపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.

 ఆ తర్వాత గతేడాది సెప్టెంబరులో ఎమ్మెల్యే జశ్వంత్‌ ఇల్లుతో పాటు ఆయన కుటుంబం నిర్వహించే స్కూళ్లు, ఆఫీసులు, ఓ ఫ్యాక్టరీలో తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల్లో లెక్కల్లో చూపని రూ.16.57 లక్షల నగదు, విదేశీ కరెన్సీ, కొన్ని కీలక పత్రాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ అధికారులు ఆయనపై మనీలాండరింగ్‌ కేసు కూడా నమోదు చేశారు.

బ్యాంక్ ఆఫ్ ఇండియా నమోదు చేసిన కేసులో విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్యే జశ్వంత్‌కు ఈడీ అధికారులు ఇప్పటికే 4 సార్లు సమన్లు జారీ చేశారు. అయితే వాటికి ఎమ్మెల్యే నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం, విచారణకు హాజరు కాకపోవడంతో తాజాగా ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. 

అయితే ఈ అరెస్టును ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. బహిరంగ సభ నుంచి ఒక ఎమ్మెల్యేను బలవంతంగా కస్టడీలోకి తీసుకోవడం దారుణమని ఆప్ అధికార ప్రతినిధి మాల్విందర్‌ కాంగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పంజాబ్‌లోని లుధియానా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఫిర్యాదు ఆధారంగా మ‌జ్రాతో పాటు ఇత‌రుల‌పై ద‌ర్యాప్తు ఏజెన్సీ కేసు న‌మోదు చేసింది. ఈ కేసులో పలువురు వ్య‌క్తులు, సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్‌లు, ఇత‌ర ప్ర‌భుత్వ అధికారుల‌పైనా అభియోగాలు న‌మోద‌య్యాయి.