నాగరికత – అనాగరికతల మధ్య సంఘర్షణ

— ప్రదక్షిణ

 

7 అక్టోబర్ 2023 తేదిన ఇస్రాయెల్ పైన, పాలస్తీనా గాజా ప్రాంతం నుంచి, ఇస్రాయెల్ లో యూదు ప్రజల ఇళ్ళల్లో జొరబడి, వేలాదిమంది హమాస్ జిహాద్ ఉగ్రవాదులు జరిపిన దాడులు ప్రపంచాన్ని నివ్వెరపరచి, విషాదంలో ముంచాయి. 1500మంది యూదులను అప్పటికప్పుడు హత్యలు చేసి, స్త్రీలు పిల్లలతో సహా వందలమందిని అపహరించుకుని పోయారు. ఉగ్రవాద ISIS క్రూరత్వం కూడా హమాస్ ముందు పనికిరానంత స్థాయిలో ఈ దౌర్జన్యం సాగింది – యూదు స్త్రీలను హత్యచేసి, వారి శవాలను కూడా అవమానించి, రోడ్లపై ప్రదర్శించారు. రెండువైపుల నుంచి యుద్ధం మొదలైన తరువాత కూడా, హమాస్ హతులు, క్షతగాత్రుల సంఖ్య గురించి తప్పుడు లెక్కలు చెపుతుంటే, పాశ్చాత్య, భారతీయ మీడియా, అవే లెక్కలు ప్రజలకు చెప్తున్నాయి. హమాస్ అనగా `ఇస్లామియా ప్రతిఘటన’ అని అర్ధం, అయితే నిజానికి వారు చేస్తున్నది ‘ఇస్లామియా జిహాద్’. రెండవ ప్రపంచయుద్ధ సమయంలో జాత్యహంకార ద్వేషంతో హిట్లర్  నాజీ జర్మనీ, 60లక్షల యూదులను `గాస్ చేంబర్, నిర్బంధ క్యాంపుల్లో’ హత్య చేసింది ( అప్పటి క్రైస్తవ పోప్ పైయస్, జెరూసలేం ప్రధాన ముఫ్తీ హిట్లర్ కి మద్దతు ఇచ్చారనేది నిర్వివాదాంశం). అ తరువాత కూడా ఇస్రాయెల్ పైన ఎన్నో ఉగ్రదాడులు జరిగినా, ప్రస్తుత హమాస్ దాడి నాటి నాజీలను గుర్తుకు తెస్తోంది.

షియా ఇరాన్ హెజ్బొల్లా ఉగ్రసంస్థ ద్వారా, చైనా మద్దతుతో ఇరాన్, లెబనాన్ లు హమాస్ తరపున జిహాద్ చేస్తున్నారు; టర్కీ, కతార్ దేశాలు- హమాస్ మద్దతుదారులు, నిధులు కూడా సమకూరుస్తారు. రష్యా వేచి చూస్తోంది; సౌదీఅరేబియా, ఎమిరాట్స్ దేశాలు ప్రస్తుతం తటస్థంగా ఉన్నా, యుద్ధం కొనసాగితే ఏమౌతుందో చెప్పలేము. అమెరికా, ఇస్రాయెల్ ని కొంచెం వెనక్కి లాగుతూ, యుద్ధం మరింత పెరగకూడదని చూస్తోంది. ఇస్రాయెల్ -పాలేస్తినా ఘర్షణ ఎక్కడ మరో ప్రపంచయుద్ధానికి దారి తీస్తుందో అని చాలా దేశాలు భయపడుతున్నాయి. ప్రపంచ చిత్రపటంలో ఒక చిన్న చుక్కగా కనిపించే ఇస్రాయెల్, అరబ్ ముస్లిందేశాల శత్రుకూటమి చుట్టుముట్టగా, తన మనుగడ కోసం పోరాడుతోంది. 24లక్షల ముస్లిం జనాభా ఉన్న అతిచిన్న గాజా ప్రాంతంలో, హమాస్ 1300 సొరంగాలు తవ్వి, ఆయుధాలతో, జిహాదీలతో వాటిని నింపింది. అమాయక గాజా ప్రజలను ఇస్రాయెల్ చంపుతోందని ఆరోపణలు చేస్తున్నవారు, ఇస్రాయెల్  పౌరులు, స్త్రీలు, పిల్లల మీద హమాస్ దాడి చేసినపుడు, ఇస్లామియా జిహాద్ పరమావధిగా బ్రతికే ఇదే గాజా ప్రజలు ఎలా ఆనందంతో పండగ చేసుకున్నారో గమనించరు. 47-48% శాతం గాజా ప్రజలు, 18సం లోపువారే, ఇక్కడి సంతానోత్పత్తి రేటు దాదాపు 4 (ఒక అధ్యయనం ప్రకారం 4.3 ), అంటే ప్రతి కుటుంబానికి సగటున నలుగురు పిల్లలు. ఒక దశాబ్దం ముందు ఈ రేటు 5 ఉండగా, కొన్ని దశాబ్దాల ముందు ఇది 8 లేక 9 ఉండేది.

 1987 హమాస్ చార్టర్ చూస్తే, వారి జిహాద్ లక్ష్యాలు అర్దం అవుతాయి. ప్రపంచంలో యూదులు, ఇతర ముస్లిమేతరులను మట్టుబెట్టాలని, ప్రపంచం వక్ఫ్ ఆస్తి అని, ఒకసారి ముస్లిములు ఏలిన రాజ్యాలను వారు తిరిగి రాబట్టుకోవడానికి జిహాద్ చేయాలని వారు ప్రకటించారు. హమాస్ సంస్థాపకుడైన షేక్ హసన్ కుమారుడు, మొసాబ్ హసన్ యూసుఫ్, ఒక టీవీ ఇంటర్వ్యూలో `హమాస్ జిహాద్’ని పూర్తిగా ఖండిస్తూ, ప్రపంచం ఇస్రాయెల్  తరపున నిలబడి, ఉగ్రవాద జిహాద్ ను అంతం చేయాలని’ కోరాడు. శివభక్తులు, శ్రీకృష్ణ భక్తులైన భారత ప్రజలు ఇస్లామియా ఉగ్రవాదాన్ని అర్ధం చేసుకుని జాగ్రత్తపడి, తమనుతాము కాపాడుకోవాలని, భారతదేశాన్ని కోరాడు.

అసత్య కధనాలు

గతకొన్ని దశాబ్దాలుగా, పాశ్చాత్య, ఇస్లామియా దేశాలు, రాజకీయ కారణాల వల్ల అసత్యాలను ప్రచారం చేస్తూ, ఉగ్రవాద ధోరణులను ఉపేక్షించి, వాటిని వేలెత్తి చూపినవారిని `ఇస్లామోఫోబియా’ అని పేరుపెట్టి, జిహాద్ లను పెంచి పోషించారు. ఈనాడు జిహాద్ యూరోప్ లో ప్రవేశించి, అక్కడ అతలాకుతలం చేస్తుంటే, ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 60దాకా ఉన్న ఇస్లామియా దేశాలు, OIC లాంటి సంస్థలు/వేదికలు నిర్మించుకుని, పెట్రో-డాలర్ వ్యవస్థలో ఆర్ధికంగా బలపడి, సిరియాలాంటి దేశాల్లో నిరంతరం అంతర్గత యుద్ధాలు చేసుకుంటూ, వాటికి నిధులు సమకూర్చుకుంటూ, అక్కడి శరణార్థులను సంపన్న ముస్లిందేశాలు తీసుకోకుండా, వారందరినీ పాశ్చాత్య దేశాలకు పంపిస్తున్నారు. తామే మతయుద్ధాలు చేస్తూ కూడా, ముస్లిములే బాధితులు అంటూ `atrocity literature’ తయారుచేసి ప్రచారం చేస్తారు.

  • పాలెస్తినా పైన ఇస్రాయెల్ దాడి చేస్తోంది– ఇది ఒక అబద్ధం. హమాస్/ పాలెస్తినా, ఇస్రాయెల్ పైన ఉగ్రవాదదాడులు జరిపింది. కిరాతకంగా పిల్లల హత్యలు, మానభంగాలు చేసింది. నేడు ప్రపంచం దృష్టి మరల్చడానికి, తప్పుడు కధనాలు సృష్టించడమే కాక, దాదాపు పరిష్కారమైన పాలెస్తినా అంశాన్ని తెరమీదకి తెచ్చింది.
  • ఇస్రాయేల్ పాలెస్తినాను ఆక్రమించుకుంది– ఇది కూడా ఇంకొక దుష్ప్రచారం; PLA (పాలెస్తినా విముక్తి సంస్థ) `వెస్ట్ బాంకు’ ప్రాంతాన్ని, 2007 నుంచి హమాస్ గాజా ప్రాంతాన్ని, పరిపాలిస్తున్నాయి. PLA అధ్యక్షుడు, ఫతా చైర్మన్ అయిన మహమూద్ అబ్బాస్ ను, హమాస్ గాజా నుంచి తరిమేసింది.
  • ఇస్రాయెల్ పాలెస్తినాపై యుద్ధం చేస్తోంది– యుద్ధం రెండువైపుల నుంచి జరుగుతోంది, ప్రతిరోజూ వేలాది రాకెట్లను హమాస్, ఇస్రాయెల్ పైన వదులుతోంది.
  • ఇస్రాయేల్ రెండు-దేశాల పరిష్కారాన్ని నిరాకరిస్తోంది– ఇది ముమ్మాటికీ అబద్ధం. హమాస్, రెండు-దేశాల పరిష్కారాన్ని నిరాకరించడమే కాక, ఇస్రాయేల్ పై జిహాద్ ఉగ్రదాడులు చేసింది.
  • ఇస్రాయేల్ పాలెస్తినాకు ఆహారం సరఫరా అవకుండా చేస్తోంది– హమాస్ తనకి అందిన మిలియన్ల డాలర్లు, ప్రజల పురోగతికి, ఆహార పంటలకి వినియోగించకుండా, 1300 భూగర్భ సొరంగాలు, యుద్ధ ఆయుధాలు సమకూర్చుకుంది. నిజానికి ఇస్రాయేల్ పాలన ఉన్నప్పుడు సమృద్ధంగా ఉన్న పాలెస్తినా, తన స్వయం పాలనలో, వ్యవసాయం, వ్యాపారాలను నాశనం చేసింది. వారి ఒకే ఒక వ్యాపారం – జిహాద్.
  • హమాస్ వేరు, పాలెస్తినా వేరు– ఇది అన్నిటికన్నా పెద్ద అబద్ధం. హమాస్ 2007 నుంచి  గాజాలో పాలక ప్రభుత్వం, 95శాతం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ఇదే ప్రజలు హమాస్ ఇస్రాయేల్ పై దాడులు జరిపితే, సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా భారతీయ వ్యాఖ్యాతలు, ఈ లేని తారతమ్యాన్ని చూపుతున్నారు.

ఇస్రాయేల్- పాలెస్తినా ఘర్షణ చరిత్ర

అబ్రహామిక్ మతాలు అనే చెప్పబడే మూడు మతాలలో, యూదుమతం మొదటిది, 3000 వేల సంవత్సరాల క్రితం ఇది పుట్టింది. ఇస్రాయెల్ యూదులకు `వాగ్దానం చేయబడ్డ భూమి/ promised homeland’; జెరూసలేం వారి  ’వాగ్దాన నగరం’.  దీని తల్లి వేరునుంచే, ఈ పశ్చిమాసియా ప్రాంతంలోనే, తరువాత రెండువేల ఏళ్ళ కాలంలో,  క్రైస్తవ, ఇస్లామియా మతాలు పుట్టాయి. అయితే యూదులు తాము `దేవుడు ఎన్నిక చేసిన ప్రజలు’ అని నమ్ముతారు, కాబట్టి వారు ఇతర మతాలవారి మీద దాడులు చేసి, వారిని మతమార్పిడి చేయరు.  మొదట క్రైస్తవ మతం `మతయుద్దాలు లేక క్రూసేడ్స్’ ద్వారా యూదులపై హింసాదౌర్జన్యాలకు పాల్పడితే, అదే బాటలో పయనించిన మహమ్మదీయులు, తరువాత కాలంలో, యూదులు, క్రైస్తవులు రెండు మతాలపై జిహాద్ చేసి, వారిని వెళ్ళగొట్టారు. అయితే క్రిస్టియన్ జియోనిస్టులు మాత్రం, ఇస్రాయేల్ కు ఆ ప్రాంతం మీద పూర్తి పారంపర్య హక్కులు ఉన్నాయని, ఇస్రాయేల్ కి యూదులు తిరిగి వస్తేనే, `క్రీస్తు రెండవ ఆగమనం’ జరుగుతుందని నమ్ముతారు. ఎన్నెన్నో తెగలు, వర్గాలు ఉన్న క్రైస్తవంలో వీరిది ఒక వర్గం. అయితే ఇక్కడ ఒక అద్భుత విషయం చెప్పాలి- ప్రపంచంలో వివిధ ప్రాంతాలకి పారిపోయిన యూదులు మాత్రం, `వచ్చే సంవత్సరం ఇస్రాయెల్ లో’ అనే వాగ్దానం ఒకరికొకరు, వేల ఏళ్ళుగా, తరతరాలుగా చేసుకుంటూ, తమ ఇస్రాయెల్ దేశాన్ని ఎప్పుడూ వారి స్మృతిపధంలో ఉంచుకున్నారు, వారి జాతి గౌరవం కాపాడుకున్నారు.

అయితే, యూదులు అందరూ వలసపోలేదు; వేల సంవత్సరాలు అన్ని అకృత్యాలు భరిస్తూ, చాలామంది అక్కడే ఉన్నారు. 19వ శతాబ్దం చివరిలో, చాలామంది సంపన్న యూదులు, ఇస్రాయేల్ లో భూములు కొనుక్కుని, అక్కడకి చేరుకున్నారు.  మొదటి ప్రపంచయుద్ధం తరువాత, ముస్లిం ఒట్టోమన్ / ఖలీఫా రాజ్యం పడిపోయాక, మరింతమంది యూదులు, భూములు కొనుక్కుని  మాతృభూమిలో స్థిరపడ్డారు. ఖలీఫా రాజ్యాన్ని, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు తమ ఆధిపత్యంలోకి తెచ్చుకున్నాయి. నేడు పశ్చిమాసియాలో మనం చూస్తున్న దేశాల రూపురేఖలు అపుడే ఏర్పడ్డాయి.  చాలామంది నిపుణుల అభిప్రాయం ప్రకారం, నేటి జోర్డాన్ దేశమే నిజమైన  పాలెస్తినా దేశం.

‘బ్రిటీషు- పాలెస్తినా మాండేట్’ ప్రకారం, యూదులు, అరబ్బులు ఇద్దరూ మాదే అనే ఇస్రాయేల్ దేశాన్ని ఇద్దరికీ కట్టబెట్టారు. వెంటనే ఈ వర్గపోరు 1947లోనే, అంతర్యుద్ధంగా పరిణమించింది. 1948 మే నెలలో ఇస్రాయేల్ దేశం స్థాపించబడగానే, మొత్తం అరబ్ దేశాలన్నీ ఒక కూటమిగా ఏర్పడి, ఇస్రాయెల్ మీద మూకుమ్మడి దాడి చేసాయి. గమ్మత్తుగా, అపుడు ఇదే `గాజా ప్రాంతాన్ని’ ఈజిప్ట్ దేశం, `వెస్ట్ బాంక్’ ప్రాంతాన్ని జోర్డాన్ ఆక్రమించుకుని, పాలెస్తినాని మనుగడలోకి రానీయలేదు; మళ్లి 1967లో జరిగిన 6-రోజుల యుద్ధంలో ఇస్రాయేల్ వాటిని విడిపించేతవరకు, పాలెస్తినా అరబ్ దేశాల అధీనంలోనే ఉంది. మళ్ళి 1972 జర్మనీ మ్యూనిక్ ఒలింపిక్స్ క్రీడలలో, `బ్లాక్ సెప్టెంబర్’ ఉగ్రవాద గ్రూప్ బాంబు దాడులు చేసి ఇస్రాయేల్ క్రీడాకారులను హతమార్చింది. యోం కిప్పర్/రామాదాన్ యుద్ధం 1973లో మళ్ళి అరబ్ దేశాల మూకుమ్మడి దాడితో జరిగింది. 1978లో ఇస్రాయెల్ ప్రధాని `మెనాచెం బెగిన్’, ఈజిప్ట్ అధ్యక్షుడు `అన్వర్ సాదత్’ల మధ్య అప్పటి అమెరికా అధ్యక్షుడు `జిమ్మీ కార్టర్’, `కాంప్ డేవిడ్’లో మధ్యవర్తిత్వం చేసి జరిపించిన ఒప్పందం, 1979లో ఈజిప్టు-ఇస్రాయేల్ శాంతి ఒప్పందానికి దారితీసింది. `బెగిన్-సాదత్’లకు నోబెల్ శాంతి పురస్కారం లభించగా, అదే సంఘటన వల్ల, ఇస్లామియా కరడుగట్టిన మతద్వేషం కారణంగా, `ఈజిప్ట్ ఇస్లామియా జిహాద్’ గ్రూపు, 1981లో అధ్యక్షుడు `సాదత్’ను హత్య చేసింది. చిన్న, పెద్ద చాలా జిహాద్ లు జరుగుతూనే ఉన్నాయి, యుద్ధం లేని దశాబ్దం అసలు లేదంటే ఆశ్చర్యం లేదు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, అన్ని యుద్ధాలు అరబ్ ముస్లిముల ద్వారానే ప్రారంభించబడ్డాయి.

1987–1993 కాలంలో, పాలెస్తినా `ఇంతిఫాడా’ నిరసనలు తగ్గుముఖం పట్టడంతో, `ఓస్లో ఒప్పందాలు’ జరిగాయి; ఆ ప్రకారంగా 1994లో `పాలెస్తినా ఆథారిటీ’ ఏర్పడింది, `వెస్ట్ బాంక్, గాజా’లో PLA ప్రభుత్వం ఏర్పాటైంది. 2002లో అరబ్-లీగ్, ఇస్రాయెల్ ని గుర్తిస్తామని ప్రకటించింది, ఈజిప్ట్- జోర్డాన్ దేశాలతో శాంతి ఒప్పందాలు, యుద్ధవిరామం జరిగాయి. PLAలో భాగమైన `ఫతా’ని తరిమేసి, 2006లో హమాస్ `గాజా’ ప్రాంతాన్ని చేజిక్కించుకుంది. 2017లో, సౌదీఅరేబియా సారధ్యంలో సున్నీ అరబ్ దేశాలు+ఇస్రాయెల్ కలిపి, ఇరాన్ ని ఎదుర్కోవడానికి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. సానుకూల పరిస్థితి ఏర్పడే దిశగా పశ్చిమాసియా ప్రాంతం అడుగులు వేస్తున్న దశలో మళ్ళి హమాస్ ద్వారా అగ్గి రాజుకుంది.

భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలు

తన మనుగడ కోసం ఇస్రాయేల్ చేస్తున్న ఈ పోరాటం, భారతీయులకి కనువిప్పు కలిగించాలి. యూదు ప్రజలు ప్రపంచంలోనే అత్యంత సంపన్నులు, `ప్రపంచ రాజ్యాన్ని’ నియంత్రిస్తారని ప్రతీతి. అతి ఎక్కువ నోబెల్ పురస్కారాలు పొందిన శాస్త్రజ్ఞ్యులు, సాంకేతిక నిపుణులు, ఆవిష్కరణ కర్తలు, ప్రఖ్యాత కళాకారులు, సినిమా దర్శకులలో అగ్రగణ్యులు యూదులే. అయితే ఇన్ని విజయాలు, గొప్ప సంపదలు, జిహాదీ దండుల మూకదాడుల ముందు, యూదు జీవితాలకి, యూదు దేశ మనుగడకి ఎటువంటి గారంటీ ఇవ్వలేకపోయాయి.

భారతదేశం ఇదే జిహాదీ భావజాలం మూలంగా, 1947లో మతప్రాతిపదికన దేశవిభజనకి గురైంది, జిన్నా `ప్రత్యక్ష చర్య’ జిహాదీ మూకల దాడులలో, భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో 5 మిలియన్లు/50 లక్షల హిందువులు ఊచకోతకి గురైయారు. ఇస్రాయేల్, భారత్ లకు ఇంకొక పోలిక ఉంది. ఇస్రాయేల్ ఏర్పడినపుడు, అరబ్ దేశాలలో ఉన్న 1 మిలియన్/10 లక్షల యూదులందరూ ఇస్రాయేల్ చేరుకొని అక్కడ స్థిరపడ్డారు, కానీ అరబ్ ముస్లిములు మాత్రం ఇస్రాయేల్ వీడలేదు, నేటికీ వీరి జనాభా ఇస్రాయేల్ లో 20% ఉంటుంది. ఇది సరిగ్గా, భారత్- తూర్పు పశ్చిమ పాకిస్తాన్ మాదిరిగానే ఉంది. భారత్ లో ముస్లిములు 20% ఉన్నా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో హిందువులు ఏమయ్యారో ఎవరూ మాట్లాడరు. దేశవిభజన తరువాత కూడా, భారతదేశం రెండు అబ్రహామిక్ మతాల మూలంగా, ఎన్నో అల్లర్లు, జిహాదులు అనుభవించింది. జనాభా మార్పు కోసం, మూకుమ్మడి మతమార్పిడులు జరుగుతున్నాయి. జిహాద్ స్వరూపంలో కూడా మార్పు లేదు, హర్యానా `నుహ్’ అల్లర్లు లేక మణిపూర్ కావచ్చు, ఢిల్లీ షాహీన్-బాగ్ లో `వీధి-శక్తి’ ప్రదర్శన కావచ్చు. భారత రాజ్యం/ప్రభుత్వం/రాజకీయ వ్యవస్థ/రాజ్యాంగం/న్యాయవ్యవస్థ, హిందువులకు న్యాయం చేకూర్చడంలో ఎప్పుడూ విఫలం అవుతూనే ఉన్నాయి. వోట్-బాంక్ రాజకీయాలు, `మైనారిటీ-వాదం’, హిందువుల హక్కులను కాలరాస్తున్నాయి. కనీసం హిందూ దేవాలయాలు కూడా హిందువుల వద్ద లేవు. హిందూ మేధావులు, కార్యకర్తలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా, భారత ప్రజాస్వామ్యం ద్వారానే, ఆ విలువలని నాశనం చేసున్న రాజకీయ పార్టీలు, సంస్థలు, వ్యక్తులు ఎందరో. భారతీయులు ఇస్రాయెల్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.