19 గంటల్లో వేగంగా రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి

* రైల్వే ప్రమాదం తీరుపై సీఎం జగన్ అనుమానాలు

విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగిన  కొత్తవలస మండలం కంటకాపల్లి- అలమండ మధ్య ట్రాక్ పునరుద్దరణ పనులను యుద్ధ ప్రాతిపదికన 19 గంటల్లో పూర్తి చేశారు. ట్రాక్ మరమ్మతులు పూర్తి కావడంతో ఒకేసారి రెండు రైళ్లను వదిలారు. ప్రమాదం జరిగిన అరగంటలోనే సంఘటనా స్థలానికి చేరుకున్న డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ సౌరభ్‌ ప్రసాద్‌ ఆధ్వర్యంలో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి.

అడ్మినిస్ట్రేషన్‌, నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ఫోర్స్‌ బృందాలు, రెస్క్యూ అంబులెన్స్‌లు, యాక్సిడెంట్‌ రిలీఫ్‌ రైళ్లును, వైద్య బృందాలను సంఘటనా స్థలానికి తరలించారు.  ట్రాక్‌ పునరుద్ధరణ పనుల్లో భాగంగా దెబ్బతిన్న కోచ్‌లను తొలగించారు. పునరుద్ధరణ చర్యలను ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ మనోజ్‌ శర్మ, సీనియర్‌ అధికారులు పర్యవేక్షించారు.

మెయిన్‌లైన్‌లో రైలు సేవల పునరుద్ధరణ కోసం వెయ్యి మందికి పైగా కార్మికులు, సిబ్బంది, వివిధ విభాగాలకు చెందిన సూపర్‌వైజర్లు కృషి చేశారు.  అధునాత క్రేన్‌లను, యంత్రాలను ఉపయోగించారు. సోమవారం ఉదయం 11.45కి ట్రాక్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ను రైల్వే ఇంజినీరింగ్‌ అధికారులు ఇవ్వడంతో మధ్యాహ్నం 2:23 గంటలకు డౌన్‌లైన్‌లో గూడ్స్‌ రైలును, 2:36 గంటలకు అప్‌లైన్‌లో భువనేశ్వర్‌ – బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను నడిపారు. ప్రమాదం కారణంగా 47 రైళ్లు రద్దయ్యాయి. 24 రైళ్లు దారి మళ్లించబడ్డాయి. ఎనిమిది రైళ్లు షార్ట్‌ టెర్మినేట్‌ చేయబడ్డాయి. ఎనిమిది రైళ్లను రీషెడ్యూల్‌ చేశారు.

ట్రాక్ వద్దకు జగన్ పర్యటన మల్లింపు
 
కాగా ట్రాక్ పునరుద్ధరణ పనులకు ఆటంకం లేకుండా ఉండేందుకు రైల్వే అధికారుల విజ్ఞప్తి మేరకు రైలు ప్రమాద ఘటనా స్ధల పరిశీలనకు  కాకుండా నేరుగా ఆసుపత్రికి వెళ్లి బాధితులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పరామర్శించారు. ఘటనా స్ధలంలో ప్రమాదానికి గురైన బోగీలను తొలగించి యుద్ద ప్రాతిపదికన ట్రాక్‌ పునురుద్ధరణ పనులు చేపడుతున్నందున ముఖ్యమంత్రి ఘటనా స్ధలానికి వస్తే ట్రాక్‌ పునరుద్ధరణ పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.
దీంతో ఘటనా స్ధల పరిశీలనకు కాకుండా సీఎం నేరుగా విజయనగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. కాగా, ఈ ప్రమాదం జరిగిన తీరు పలు అనుమానాలకు తావిస్తోందంటూ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ కేంద్రానికి మూడు ప్రశ్నలను సంధించారు. 1. బ్రేకింగ్ సిస్టమ్ మరియు అలర్ట్ సిస్టమ్ ఎందుకు పని చేయలేదు? 2. సిగ్నలింగ్ ఎందుకు విఫలమైంది? 3. కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలా విఫలమైంది?
ఈ ప్రశ్నలను లేవనెత్తిన సీఎం జగన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ట్యాగ్ చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి భయనక ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. కేవలం ఈ మార్గంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రైల్వే మార్గాల్లో తాను లేవనెత్తిన ప్రశ్నలతో పాటు అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఒక ఉన్నత స్థాయి ఆడిట్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

ఇలా ఉండగా, రైలు ప్రమాదం కేవలం మానవ తప్పిదంగానే కనిపిస్తుంది. డెడ్‌ స్లోగా వెళ్లాల్సిన రాయగడ పాసింజర్‌ రైలు లోకో ఫైలట్‌ నిర్లక్ష్యం కారణంగా సిగ్నల్‌ను ఓవర్‌ షూట్‌ చేసినట్టు రైల్వే అధికారులు ప్రాథ‌మిక నిర్ధారణ చేసినట్టు తెలుస్తుంది. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతోంది. మరో వైపు ఒకే సమయంలో ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఏ విధంగా సిగ్నల్‌ ఇచ్చారు ? నిజంగానే మానవ తప్పిదమా ? లేక సాంకేతికపరమైన కారణాలు ఉన్నాయా ? అనే విషయాలపై కూడా ప్రతి అంశాన్ని కూడా రైల్వే అధికారులు క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. 
ఇప్పటికే ఈ ఘటనపై రైల్వే మంత్రి సైతం ప్రత్యేక విచారణకు ఆదేశించిన నేపధ్యంలో వాల్తేరు డిఆర్‌ఎం ఆయా విచారణకు సంబంధించి కూడా ప్రత్యేకంగా చ‌ర్య‌లు చేపట్టేందుకు సిద్దమవుతున్నారు. మరోవంక, తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలో కొద్ది నెలల వ్యవధిలో చోటుచేసుకున్న రెండు రైలు ప్రమాదాలు ప్రయాణికుల్లో అభద్రతాభావాన్ని కల్గిస్తున్నాయని బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాసిన లేఖలో హౌరా-చెన్నై ప్రధాన రైల్వే మార్గంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లో రైలు భద్రతపై విస్తృతస్థాయిలో సమీక్ష నిర్వహించాలని ఆయన కోరారు.