మద్యం అమ్మకాలలో అక్రమాలు.. చంద్ర బాబు పై మరో కేసు

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ సిఐడి మరో కేసు నమోదు చేసింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలతో పీటీ వారెంట్ ను దాఖలు చేసింది. చంద్రబాబును ఏ3గా చేర్చగా సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ ను ఏసీబీ కోర్టు అనుమతించింది. అవినీతి నిరోధక చట్టం కింద (ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్) చంద్రబాబుపై ఈ కేసు నమోదైంది.ఈ కేసుకు 18/2023 ఎఫ్ఐఆర్ నంబర్ ను కేటాయించారు.
 
తాజాగా నమోదైన కేసులో ఏ1గా నరేశ్ పేరు ఉండగా, ఏ2గా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేరును ప్రస్తావించారు. ఏ3గా చంద్రబాబు పేరును నమోదు చేశారు. ఏపీ బెవరేజస్ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఐఆర్ లో తెలిపారు.  ఇప్పటికే దాఖలైన స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసులలో చంద్రబాబుల విచారణ ఎదుర్కొంటున్నారు. 
 
స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఆయన ప్రస్తుతం రాజమహేంద్రవరం జైలులో ఖైదీగా ఉన్నారు. ఇప్పటికే 50 రోజులు పూర్తికాగా బెయిల్ కోసం ఆయన తరపు న్యాయవాదులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కూడా ఆశ్రయించారు. 
 
అత్యవసర కారణాలతో వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై సోమవారం  కూడా ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు బాబు తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్‌, లూథ్రాలు వాదనలు వినిపించారు. చంద్రబాబు ఆరోగ్య రిత్యా బెయిల్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 
 
సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు వాదనలు వినిపించగా, ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. మంగళవారం నిర్ణయం వెల్లడిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇక మెయిన్ బెయిల్ పిటిషన్ పై విచారణ ఎపుడు చేపట్టాలో కూడా నిర్ణయం తీసుకుంటామని తీర్పులో పేర్కొన్నారు.