పుల్వామాలో యుపి వలస కార్మికుడిని చంపిన ఉగ్రవాదులు

భారత సరిహద్దుల్లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. ఓ వలస కార్మికుడిని దారుణంగా హతమార్చారు. సరిహద్దు భద్రతా దళ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర ప్రదేశ్ కి చెందిన ముఖేష్ వలస కార్మికుడు జమ్మూ కశ్మీర్ లో పని చేస్తున్నాడు.
 
పుల్వామాలో విధుల్లో ఉండగా అకస్మాత్తుగా ఉగ్రవాదులు ఆయన ఉన్న ప్రాంతంపై తుపాకులతో విరుచుకుపడ్డారు. ముఖేష్ ని బంధించి కళ్లు, పొట్ట, మెడపై మూడు సార్లు కాల్పులు జరిపారు. దాడిని గుర్తించిన భద్రతాదళ సిబ్బంది వారిపై ఎదురు దాడికి దిగారు. రెండు వైపుల జరిగిన కాల్పులతో సరిహద్దులో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

తీవ్రంగా గాయపడిన ముఖేష్ మరణించినట్లు కశ్మీర్ పోలీసులు ధ్రువీకరించారు. ఘటన జరిగిన ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆఫ్ డ్యూటీ కాప్ మస్రూర్ అహ్మద్ వనీ ఈద్గా ప్లేగ్రౌండ్‌లో కశ్మీర్ పోలీసులు, లష్కరే తోయిబా ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగిన ఒక రోజు తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది. 

ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దాడి తరువాత పుల్వామాలో భద్రతా దళాలు వాహనాలు, పాదచారులను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నాయి. శ్రీనగర్‌లోని అన్ని ప్రధాన కూడళ్లతో పాటు నగరంలోని ఎగ్జిట్ పాయింట్ల వద్ద మొబైల్ వెహికల్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

సోమవారం ఉదయం, కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి ఒక ఉగ్రవాదిని హతమార్చడం ద్వారా భద్రతా బలగాలు చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేశాయని అధికారులు తెలిపారు. కెరాన్ సెక్టార్‌లోని జుమాగుండ్ ప్రాంతంలో చొరబాటుకు యత్నించిన ఉగ్రవాదుల ప్లాన్ ఫెయిల్ అయినట్లు చెప్పారు. సోమవారం ఉదయం ఆ ప్రాంతంలో జరిగిన సర్చ్ ఆపరేషన్ లో ఓ ఉగ్రవాది మృతదేహం లభ్యమైనట్లు వారు తెలిపారు.