
ఏపీ బెవరెజెస్ కార్పోరేషన్ వద్ద 100కు డిస్టలరీ కంపెనీల నమోదయ్యాయని, కానీ 74 శాతం మద్యం సరఫరాను కేవలం 16 కంపెనీలే చేస్తున్నాయని చెబుతూ కీలకమైన రెండు కంపెనీల వెనుక వైసిపి ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు ఉన్నారని మాజీ, కేంద్ర మంత్రి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు.
ఏపీలోని డిస్టలరీస్ యజమానుల వివరాలు ఇవ్వగలరా? అని తాము సవాల్ విసిరితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించ లేదని ఆమె ఎద్దేవా చేశారు. అదాన్ డిస్టలరీస్ 2019లో మొదలైందని, రూ. 1164 కోట్ల మేర మద్యం సరఫరా ఆర్డర్ అదాన్ కంపెనీకే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
అదాన్ కంపెనీ వెనుక ఎంపీ విజయసాయి రెడ్డి ఉన్నారని చెబుతూ చింతకాయల రాజేష్, పుట్టా మహేష్ వంటి వారికి చెందిన సంస్థలను బలవంతంగా అదాన్ కంపెనీ చేజిక్కించుకుందని ఆమె ఆరోపించారు. ఎస్పీవై అగ్రస్ సంస్థకు రూ. 1800 కోట్ల మేర సరఫరా ఆర్డర్స్ ఉన్నాయని చెబుతూ ఈ సంస్థ వెనుక మిధున్ రెడ్డి ఉన్నారని పురంధరేశ్వరి ఆరోపించారు.
ప్రకాశం జిల్లాలో పెర్ల్ డిస్టలరీస్ దీన్ని సీఎం జగన్ సన్నిహితులు బలవంతం పెట్టి సబ్ లీజుకు తీసుకున్నారని ఆమె విమర్శించారు. ప్రభుత్వానికి మద్యం సరఫరా చేసే కంపెనీల జాబితా, ఆ కంపెనీల ఓనర్ల జాబితా ఇవ్వాలంటే ఇవ్వలేదని, ఇప్పుడు తామే ఆ వివరాలు బయట పెట్టామని ఆమె పేర్కొన్నారు.
దశలవారీ మద్య నిషేధం చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని, మద్యం తయారీదారులు, అమ్మకం దారులను ఏడేళ్ల పాటు జైలుకు పంపుతామన్నారని ఆమె గుర్తు చేశారు. ఇప్పుడు మద్యం తయారీదారుల జాబితా విడుదల చేశామని చెబుతూ వారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని పురంధరేశ్వరి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
లెక్కల్లోకి రాని మద్యం డబ్బుల వివరాలేవి? పైగా, మద్య నిషేధం అమలు చేయబోమని చెప్పి మరీ మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని ఆమె ధ్వజమెత్తారు. ఫోన్ పే, గూగుల్ పే వంటివి మద్యం దుకాణాల్లో ఎందుకు కన్పించవని పురంధరేశ్వరి నిలదీశారు.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు