భారత దేశంలో ఎక్కడాలేని అవకాశాలు

 
ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కవ అవకాశాలు కలిగిన దేశం భారత దేశమని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. గుంటూరు జిల్లా, వడ్లమూడిలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొంటూ విదేశాల నుంచి 13 మేజర్‌ స్టార్టప్‌ కంపెనీలు మనదేశంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయని తెలిపారు. 
 
ఈ కంపెనీలు తమ ఉత్పత్తులను మన దేశంలో తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తాయని ఆమె తెలిపారు. సాఫ్ట్‌వేర్‌, ఐటి కంపెనీలలో విద్యార్థులు ఉద్యోగాలను వెతుకోక్కుండా మెటీరియల్స్‌, రేర్‌ మినరల్స్‌, మెటీరియల్‌ సైన్స్‌, డ్రోన్‌ టెక్నాలజీ వంటి రంగాలలో పరిశోధనలకు పూనుకోవాలని ఆమె సూచించారు. 
 
దీనికి అనుగుణంగా ప్రస్తుత విద్యావిధానంలో ఎస్‌టిఇఎమ్‌ (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మేథమాటిక్స్‌)కి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా సహజసిద్ధమైన గ్యాస్‌ టెక్నాలజీ మీద కూడా పరిశోధనలు చేయాలని కేంద్ర మంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక, శాసన వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులందరికీ అపారమైన అవకాశాలు ఉన్నాయని, వాటిని ఒడిసిపట్టుకోవాలని సూచించారు.
స్నాతకోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో కృషి చేసిన హైదరాబాద్‌లోని అనంత్‌ టెక్నాలజీస్‌ ఫౌండర్‌ డాక్టర్‌ సుబ్బారావ్‌ పావులూరి, హైదరాబాద్‌లోని విమ్టా ల్యాబ్స్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌పి వాసిరెడ్డి, ఇండియన్‌ చెస్‌ ప్లేయర్‌, పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత కోనేరు హంపికి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేశారు. 
 
కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌చైర్మన్‌, ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.
 

.