దుష్టశక్తులను ఒక సవాలుగా సనాతన ధర్మం

దుష్టశక్తులను ఒక సవాలుగా సనాతన ధర్మం తీసుకుంటుందని, దేశం, దేశ ప్రజల సంక్షేమానికి పాటుపడుతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. దేవీ శరన్నవరాతుల్లో తొమ్మిదవ రోజైన మహానవమి పండుగ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి యుగంలోనూ, ప్రతి సందర్భంలోనూ దుష్టశక్తుల ప్రభావం పెచ్చరిల్లినప్పుడు సతాతన ధర్మం ఆ దుష్టశక్తులు విసిరే సవాళ్లను ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు. 
 
పైగా, దేశం, దేశ ప్రజల సంక్షేమానికి పాటుపడుతుందని చెప్పారు. సనాతన ధర్మం మానవత్వానికి మార్గనిర్దేశం చేస్తుందని చెబుతూ  ధర్మం, సత్యం, న్యాయానిదే గెలుపని చెప్పే పండుగ విజయదశమి అని పేర్కొన్నారు.  గోరఖ్‌నాథ్ ఆలయ ప్రధాన అర్చకుడు కూడా అయిన యోగి ఆదిత్యనాథ్ సోమవారంనాడు ‘కన్యాపూజ’ నిర్వహించారు.
 
మాతృశక్తిగా, దుర్గాదేవి తొమ్మిది అవతారాలకు సంకేతంగా తొమ్మిది మంది బాలికలకు పాదపూజ చేశారు. ఇందులో భాగంగా మెటల్ ప్లేట్‌లో బాలికల కాళ్లను కడిగి, వారి నుదుట తిలకం దిద్దారు. మంత్రోచ్ఛారణల మధ్య వారికి హారతి ఇచ్చారు. అనంతరం గోరఖ్‌నాథ్ ఆలయ వంటశాలలో తయారు చేసిన తాజా ఆహారాన్ని వారికి స్వయంగా తినిపించారు. 
 
వీరితో పాటు పెద్ద సంఖ్యలో హాజరైన బాలబాలికలు ఆయన హారతి ఇచ్చారు. కన్యాపూజ అందుకున్న వారి నుంచి ఆశీస్సులు తీసుకుంటూ వారికి దక్షిణ, బహుమతులు ఇచ్చారు. ఈ పూజ అనంతరం బతుక్ (కాలభైరవ్) పూజను కూడా యోగి ఆదిత్యనాథ్ నిర్వహించారు. 
 
కన్యాపూజ సందర్భంగా ఆయనతో పాటు కాశీ నుంచి వచ్చిన మహామండలేశ్వర్ సంతోష్ దాస్ సతువ బాబా, కాలీబరి నుంచి విచ్చేసిన హమంత్ రవీంద్రదాస్, గోరఖ్‌నాథ్ ఆలయ పూజారి ఆచార్య రామానుజ్ త్రిపాఠి వేదిక్ తదితరులు హాజరయ్యారు. దీనికి ముందు ఆలయ శక్తిపీఠంలోని సిద్ధదాత్రి అమ్మవారికి యోగి ఆదిత్యానాథ్ ప్రత్యేక పూజలు చేశారు.