క్రికెట్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ కన్నుమూత

భారత దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన బిషన్ సింగ్ బేడీ (77) కన్నుమూశారు. స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ గా 1966 నుంచి 1979 వరకు భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కిషన్ సింగ్ బేడీ సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు.

1946 సెప్టెంబర్ 25న అమృతసర్ లో జన్మించిన బిషన్ సింగ్ బేడీ 67 టెస్ట్ మ్యాచ్ ల్ ల్లో ఆడి 266 వికెట్లు తీసుకున్నాడు. 22 టెస్ట్ మ్యాచ్ లకు జట్టుకు సారధ్యం వహించాడు. తన 15వ ఏట నార్త్రన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ దేశవాళీ క్రికెట్ లో అడుగు పెట్టాడు.  పది వన్డేలు ఆడిన బేడీ ఏడు వికెట్లు తీశారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 370 మ్యాచ్‌లలో 1560 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలరల్లో ఒకడిగా ఉన్నారు. 

ఆయనకు 1970లో కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ పురస్కారాన్ని అందజేసి బిషన్ సింగ్ బేడీని గౌరవించింది. 2004లో సీకే నాయుడు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు అందుకున్నారు. 1979లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అమృత్‌సర్‌లో నుండి వ్యాపారం కోసం కుటుంబం ఢిల్లీకి రావటంతో బేడీ కూడా ఇండియాకు వచ్చారు.

బిషన్ సింగ్ బేడీ, ఎర్రపల్లి ప్రసన్న, బీఎస్ చంద్రశేఖర్, ఎస్. వెంకటరాఘవన్.. నలుగురూ కూడా ఇండియన్ స్పిన్ బౌలింగ్ చరిత్రలోనే ఓ రెవెల్యూషన్ తీసుకువచ్చారు. ముఖ్యంగా వన్డేలలో టీమిండియా తొలి విజయాన్ని అందుకుందంటే అది బిషన్ సింగ్ బేడీ వల్లేనని చెప్పవచ్చు. 1975 ప్రపంచకప్‌లో భాగంగా ఈస్ట్ ఆఫ్రికాతో తలపడిన భారత్. 120 పరుగుల తేడాతో వారిని చిత్తుచేసి వన్డేలలో తొలి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో 12 ఓవర్లు బౌలింగ్ చేసిన బిషన్ సింగ్ బేడీ..8 మెయిడెన్ ఓవర్లు విసిరారు. కేవలం ఆరు పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టారు.

 
ఇక దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ టీమ్‌కు ఆడిన ఆయన రిటైర్మెంట్ తర్వాత పలువురు వర్ధమాన క్రికెటర్లకు కోచ్, మెంటార్‌గా పనిచేశారు. కామెంటేటర్‌గానూ క్రికెట్‌తో తన అనుబంధాన్ని కొనసాగించారు బిషన్ సింగ్ బేడీ. 1990లో న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లలో పర్యటించిన భారత జట్టుకు బేడీ మేనేజర్‌గా వ్యవహరించారు. 
జాతీయ సెలెక్టర్‌గా, మెంటార్‌గా వ్యవహరిస్తూ మురళీ కార్తీక్, మణిందర్ సింగ్ లాంటి బౌలర్లను వెలుగులోకి తీసుకురావటంలో ఆయన పాత్ర మరువలేనిది.
బేడీ 1978-79, 1980-81లో రంజీ ట్రోఫీలో ఢిల్లీకి వరుస టైటిల్స్‌కు నాయకత్వం వహించాడు. అంతేకాకుండా, బేడీ కౌంటీ క్రికెట్‌లో దిగ్గజంగా ఎదిగాడు. అక్కడ అతను నార్తాంప్టన్‌షైర్ తరపున 102 ఫస్ట్-క్లాస్ గేమ్‌లు ఆడాడు. 1972 నుండి 1977 వరకు 434 వికెట్లు తీసుకున్నాడు.