ఇజ్రాయెల్‌ వైమానిక దాడిలో ఆర్టిలరి గ్రూప్‌ డిప్యూటీ హెడ్‌ మృతి

ఇజ్రాయెల్‌ – హమాస్‌ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు సుమారు 5500 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కాగా, గాజాలో వైమానిక దాడి చేసి, ఉగ్రవాద సంస్థ హమాస్‌కు చెందిన మరో కీలక అధికారి హతమార్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రకటించాయి.  హమాస్‌లో కీలక పాత్ర పోషిస్తున్న పలువురిని ఇజ్రాయెల్‌ సైన్యం మట్టుబెట్టింది.
ఆదివారం గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ దళాలు జరిపిన వైమానిక దాడి నిర్వహించిందని, ఇందులో హమాస్‌ ఆర్టిలరి గ్రూప్‌ డిప్యూటీ హెడ్‌ మహ్మద్‌ కటామాష్‌ మృతి చెందాడని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) ప్రకటించింది.  మహ్మద్‌ సెంట్రల్‌ క్యాంప్‌ బ్రిగేడ్‌లో ఫైర్‌ అండ్‌ ఆర్టిలరి మేనేజ్‌మెంట్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడని పేర్కొంది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా జరిపిన దాడుల ప్రణాళిక అమలులో కీలక పాత్ర పోషించాడని చెప్పింది.
అలాగే ఇజ్రాయెల్‌ దాడిలో రాకెట్ ఫైరింగ్ స్క్వాడ్ చీఫ్‌ సైతం ప్రాణాలు కోల్పోయాడు.  ఇజ్రాయెల్ దళాలు ఆయుధాల ఉత్పత్తి కేంద్రం, సైనిక ప్రధాన కార్యాలయంపై కూడా దాడి చేసి ధ్వంసం చేశాయి. అదే సమయంలో భద్రతా దళాలు ఇద్దరు హమాస్‌ కమాండోలను సైతం అరెస్టు చేసినట్లు షిన్‌బెట్‌ ప్రకటించింది. ఇద్దరు కమాండోలు హమాస్‌కు చెందిన నుఖ్‌బర్ కమాండో దళాలకు చెందిన తెలిపింది.
 
గాజాలో హమాస్‌ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ సైన్యం దాడులకు పాల్పడుతోంది. హమాస్‌ గ్రూపు సమావేశమైన ప్రదేశాలను ఇజ్రాయెల్‌ సైన్యం నాశనం చేస్తోందని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. గడచిన 24 గంటల్లో జరిగిన దాడులపై ఇజ్రాయెల్‌ సైనిక ప్రతినిధి రియర్‌ అడ్మిరల్‌ డేనియల్‌ హగారి మీడియాతో మాట్లాడుతూ గాజా లోపల హమాస్‌ సైనిక స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సాయుధ, పదాతిదళ బెటాలియన్లు దాడులు నిర్వహించాయని తెలిపారు. 
 
ఈ దాడులు యుద్ధంలో హమాస్‌ ఉగ్రవాదుల్ని చంపే తదుపరి దశకు తీసుకెళతాయని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ నేపథ్యంలో అదివారం రాత్రి గాజా స్ట్రిప్‌లో 320కి పైగా హమాస్‌ స్థానిక స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. ప్రధానంగా హమాస్‌ గ్రూపు కమాండ్‌ సెంటర్లు, సైనిక స్థావరాలు, హమాస్‌ గ్రూపు సమావేశమైన ప్రదేశాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. 
 
అలాగే ఈ దాడులపై హమాస్‌ గ్రూపు కూడా ఓ ప్రకటనను విడుదల చేస్తూ సైనిక స్థావరాలపై దాడులు చేసి, పరికరాలను ధ్వంసం చేసినా తాము ధైర్యంగానే ఎదుర్కొన్నామని, పదాతి దళాలను తిప్పికొట్టినట్లు వెల్లడించింది