ఆర్మీ వివరాలను పాక్‌కు పంపుతున్న గుజరాత్ వ్యక్తి అరెస్ట్‌

పాకిస్థాన్‌ తరుఫున గూఢచర్యం చేస్తున్న గుజరాత్‌ వ్యక్తి భారత్‌ ఆర్మీకి సంబంధించిన వివరాలను ఆ దేశానికి చేరవేస్తున్నాడు. మిలిటరీ ఇంటెలిజెన్స్ (ఎంఐ) ద్వారా సమాచారం అందుకున్న యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేశారు.  53 ఏళ్ల లాభశంకర్ మహేశ్వరి అనే వ్యక్తి పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌కు చెందిన వాట్సాప్‌ నంబర్‌ వినియోగించాడు.
ఈ ఏడాది జూలైలో ఆర్మీ పబ్లిక్‌ స్కూల్స్‌కు చెందిన ఆర్మీ అధికారిగా పేర్కొంటూ ‘హర్‌ ఘర్‌ తిరంగా’ పేరుతో ప్రచారం చేపట్టాడు.  ఆర్మీ స్కూల్స్‌లో చదువుతున్న పిల్లలు జాతీయ జెండాతో దిగిన ఫొటోలను పంపాలంటూ ఆర్మీ అధికారులకు వాట్సాప్‌ సందేశాలు పంపాడు. దీని కోసం అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలని కోరాడు.
ఆ మాల్‌వేర్‌ ద్వారా ఆర్మీ అధికారుల వాట్సాప్‌ మొబైల్‌ నంబర్లు సేకరించి పాక్‌ ఏజెంట్‌కు పంపాడు.  కాగా, మిలిటరీ ఇంటెలిజెన్స్ (ఎంఐ) దీనిని పసిగట్టింది. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులను అలెర్ట్‌ చేయడంతో లాభశంకర్‌ను అరెస్ట్‌ చేశారు. అతడ్ని ప్రశ్నించగా పాకిస్థాన్‌ హిందూ అయిన ఆ వ్యక్తి  1999లో తన భార్యతో కలిసి భారత్‌కు వచ్చినట్లు తెలిసింది. 
 
తారాపూర్‌లోని అత్తమామల ఇంట్లో ఉంటున్న అతడు దీర్ఘకాలిక భారతీయ వీసా కోసం దరఖాస్తు చేశాడు. అనంతరం 2006లో భారత పౌరసత్వం పొందాడు. గత ఏడాది పాకిస్థాన్‌లో ఉన్న తన తల్లిదండ్రులను అతడు కలిసినప్పుడు ఆ దేశ గూఢచార సంస్థతో పరిచయం ఏర్పడిందని ఏటీఎస్‌ అధికారులు తెలిపారు.