ధ్వ‌ని వేగంతో దూసుకెళ్లిన టీవీ-డీ1

గ‌గ‌న్‌యాన్ మిష‌న్‌లో భాగంగా నిర్వ‌హించిన టీవీ-డీ1 ఫ్ల‌యిట్ టెస్ట్ ప్ర‌యోగం విజయవంతం కావడంతో పాటు ఆ టీవీ-డీ1 మిష‌న్ రాకెట్ దాదాపు ధ్వ‌ని వేగం క‌న్నా అధిక వేగంతో దూసుకెళ్లిన‌ట్లు ఇస్రో చైర్మెన్ సోమ‌నాథ్ వెల్లడించారు. టీవీ-డీ1 ప‌రీక్ష విజయవంతం కావ‌డం ప‌ట్ల ఆయ‌న సంతోషం వ్య‌క్తం చేశారు. 
క్రూ ఎస్కేప్ సిస్ట‌మ్‌ను ప‌రీక్షించ‌డంలో భాగంగా ఈ ప్ర‌యోగాన్ని చేప‌ట్టామ‌ని తెలిపారు.
టీవీ-డీ1 వెహిక‌ల్ మ్యాక్ వేగంతో అంటే ధ్వ‌ని వేగంతో దూసుకెళ్లిన‌ట్లు వెల్ల‌డించారు. నింగిలోకి వెళ్లిన త‌ర్వాత‌ అన్ని ప్ర‌క్రియ‌లు స‌వ్యంగా సాగిన‌ట్లు ఆయ‌న తెలిపారు. మూడు పారాచూట్ల సాయంతో క్రూ ఎస్కేప్ మాడ్యూల్ బంగాళాఖాతంలో దిగిన‌ట్లు చెప్పారు.  అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా మ‌రిన్ని వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్న‌ట్లు సోమ‌నాథ్ తెలిపారు.
తొలుత, టీవీ-డీ1 ప‌రీక్ష వాయిదా వేయ‌డానికి గ‌ల కార‌ణాన్ని కూడా ఆయ‌న వెల్ల‌డించారు. 8 గంట‌ల‌కు వాతావరణం స‌రిగా లేని కార‌ణంగా ప‌రీక్ష‌ను 8.45 నిమిషాల‌కు వాయిదా వేసిన‌ట్లు చెప్పారు.  అయితే 8.45 నిమిషాల స‌మ‌యంలో ఇంజిన్ ఇగ్నిష‌న్ లోపం త‌లెత్త‌డంతో ప్ర‌యోగాన్ని నిలిపివేశారు. కానీ ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు వెంట‌నే ఆ లోపాన్ని గుర్తించారు.
ఆటోమెటిక్ లాంచ్ సీక్వెన్స్ కంప్యూట‌ర్ సంకేతాల ద్వారా ప‌రీక్ష‌ను వాయిదా వేశారు. థ్ర‌స్టింగ్ లోపం వ‌ల్ల ప్ర‌యోగాన్ని నిలిపాల్సి వ‌చ్చింది. చాలా వేగంగా రాకెట్‌లో మ‌ళ్లీ వాయువుల‌ను నింపామ‌ని, మిష‌న్ కంప్యూట‌ర్ సంకేతం ఇచ్చిన త‌ర్వాత రాకెట్‌ను రిలీజ్ చేసిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ పరీక్ష పేరు టీవీ-డీ1 ఫ్లైట్​ టెస్ట్ (టెస్ట్​ వెహికిల్​ డెవలప్​మెంట్​ ఫ్లైట్​ మిషన్) ఫ్లైట్​.
అనుకోని సమస్య ఏదైనా ఎదురైతే.. రాకెట్​లో నుంచి వ్యోమగాముల బృందం సురక్షితంగా బయటపడగలదా? లేదా? అన్నది తెలుసుకునేందుకు ఈ క్రూ ఎస్కేప్​ మిషన్​ ప్రయోగం ఉపయోగపడుతుంది.  చంద్రయాన్​-3 విజయవంతం కావడంతో జోరు మీద ఉన్న ఇస్రో గగన్​యాన్​ మిషన్​కి ముందు 3 మానవ రహిత మిషన్స్​ సహా 20 కీలక పరీక్షలను చేపట్టనుంది. అన్నిఅనుకున్న​ ప్రకారమే జరిగితే 2025లో గగన్​యాన్​ మిషన్​ చేపడుతుంది.