సుప్రీంలో ఎన్నికల గుర్తులపై బీఆర్ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ బిఆర్‌ఎస్‌ పార్టీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బిఆర్‌ఎస్‌ పార్టీ కారు గుర్తును పోలిన ఇతర గుర్తులను రాజకీయ పార్టీలకు కేటాయించ వద్దంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఓటర్లకు అన్నీ తెలుసని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

ఎన్నికల్లో గుర్తింపు పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే గుర్తుల విషయంలో అభ్యంతరాలు చెబుతూ బిఆర్‌ఎస్‌ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్‌, చపాతి మేకర్‌ వంటి గుర్తులను ఎన్నికల్లో కేటాయించవద్దని బిఆర్‌ఎస్‌ కోర్టును విజ్ఞప్తి చేసింది. బిఆర్ఎస్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ధ‍ర్మాసనం వారి అభ్యర్థనను తిరస్కరించింది.

జస్టిస్‌ అభయ్‌ ఓకా నేతృత్వంలోని ధర్మసనం బిఆర్‌ఎస్‌ వాదనలను కొట్టివేసింది. కారు, రోటీ మేకర్‌ గుర్తులకు తేడా తెలుసుకోలేనంత అమాయకులు ఓటర్లు కాదని అభిప్రాయపడింది. ఓటర్లకు అన్ని విషయాలు తెలుసని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

‘భారతీయ ఓటర్లు రాజకీయ నిరక్షరాసులు కాదు. ఓటర్లకు కారు, చపాతి రోలర్, రోడ్డు రోలర్ తేడా తెలియదు అనుకుంటున్నారా?.. ఎన్నికలు వాయిదా వేయాలని మీరు కోరుకుంటున్నారా? హైకోర్టు తీర్పు తర్వాత దాదాపు 240 రోజుల తర్వాత సుప్రీంకోర్టుకు రావడం ఏంటి?. అధికార పార్టీగా ఉన్న మీకు ఈ విషయం తెలియదా?’ అంటూ బీఆర్ఎస్ పార్టీ న్యాయవాదులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

గత ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తులను కొందరు అభ్యర్థులకు కేటాయించారు. ఈ గుర్తులకు వేల సంఖ్యలో ఓట్లు పోలయ్యాయి. బిఆర్‌ఎస్‌ కారు గుర్తును సదరు గుర్తులు దెబ్బకొట్టినట్టు పార్టీ భావించింది. ఈ నేపథ్యంలో గుర్తుల విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గత వారం ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించకపోవడంతో సుప్రీం కోర్టును బిఆర్‌ఎస్ ఆశ్రయించింది.

కారును పోలిన గుర్తులను తొలగించాలని, వాటిని ఏ పార్టీకి కేటాయించవద్దని కోరుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ గతంలో పలుమార్లు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. బీఆర్‌ఎస్‌ విజ్ఞప్తి మేరకు 2011లో రోడ్డురోలర్‌ గుర్తును తొలంగించినప్పటికీ తిరిగి చేర్చటాన్ని అభ్యంతరపెడుతూ ఆ గుర్తును తొలగించాలని విజ్ఞప్తి చేసింది. స్వతంత్ర అభ్యర్థులు, ఎన్నికల సంఘం గుర్తింపు పొందని పార్టీలకు కేటాయించే ఎన్నికల గుర్తుల్లో కారు గుర్తును పో లిన వాటిని కేటాయించకూడదని బిఆర్‌ఎస్‌ కోరింది. 

గతంలో జరిగిన ఎన్నికల్లో ఈ గుర్తులపై పోటీ చేసిన అభ్యర్థులకు జాతీయ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థుల కన్నా అధిక ఓట్లు వచ్చిన వైనాన్ని వివరించింది.  తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో అభ్యర్థులకు ఆ గుర్తులను కేటాయించకూడదని, తద్వారా బిఆర్‌ఎస్‌కు నష్టం వాటిల్లుతున్నదని బిఆర్‌ఎస్‌ పిటిషన్‌లో తెలిపింది.