![వారం రోజుల్లో మూడింతలు పెరిగిన ఉల్లి ధరలు వారం రోజుల్లో మూడింతలు పెరిగిన ఉల్లి ధరలు](https://nijamtoday.com/wp-content/uploads/2020/10/Onions.jpg)
దసరా పండుగ వేళ ఉల్లిపాయ ధరలు వారం రోజులుగా క్రమంగా పెరుగుతున్నాయి. నాలుగైదు రోజుల్లోనే కిలోకు రూ.10 మేర పెరగడం గమనార్హం. రైతు బజార్లలో కిలో రూ.30 వరకు పలుకుతుండగా మాల్స్, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణాల్లో రూ.35 నుంచి రూ.40 వరకు విక్రయిస్తున్నారు. ఈ ఏడాది మార్చితో పోలిస్తే కిలోకి సగటున 150 శాతంపైగా ధర పెరగడం గమనార్హం.
పండగ వేళ ఉప్పు, పప్పు తదితర నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్య జనం… ఇప్పుడు ఉల్లిపాయ ధర కూడా పెరుగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా తెలుగువారి వంటింట్లో ఉల్లిపాయ లేనిది ఏ కూర ఉండదు. అలాంటి ఉల్లి ఇప్పుడు సామాన్యులకు కన్నీరు పెట్టిస్తోంది.
పదిహేను రోజుల క్రితం కిలో ఉల్లి ధర 15 నుంచి 20 రూపాయలు ఉండగా, ఇప్పుడు ఏకంగా 35 నుంచి రూ.40కి పెరిగింది. నిన్న మొన్నటితో పోలిస్తే మూడు రెట్లు- ఉల్లి ధర పెరిగింది. దీంతో సామాన్యులు ఉల్లిపాయ కొనాలంటేనే భయపడుతున్నారు. ఉల్లిపాయలు మహారాష్ట్ర, ఏపీలోని రాయలసీమ, కర్ణాటకల నుంచి హైదరాబాద్‌మార్కెట్లకు వస్తుంటుంది.
హైదరాబాదులోని మలక్‌పేట ఉల్లిపాయ మార్కెట్లో ధరలు పెరగడంతో వ్యాపారులు సంతోషపడుతుండగా సామాన్యులు మాత్రం ఉల్లి కన్నీరు పెడుతున్నారు. అందులోనూ ఈ సీజన్‌లో పండగలతోపాటు శుభకార్యాలు కూడా ఉండడంతో ఉల్లిపాయ ధరలు పెరగడం ఇటు ప్రజలకు అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకూ ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఎన్నికల వేళ ఉల్లిపాయ ధరలు పెరగడం పేద, సామాన్యుల ఓటును ఎటువైపు మళ్లిస్తోందన్న ఆందోళన కూడా పార్టీల్లో వ్యక్తమవుతోంది.
More Stories
బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు నెగ్గిన తెలంగాణ పంతం
విదేశీ కరెన్సీలో చెల్లింపులపై కేటీఆర్ పై ఈడీ ప్రశ్నలు
కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు