కొటక్ మహింద్ర, ఐసీఐసీఐ బ్యాంక్ లకు భారీ జరిమానా

ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహింద్ర బ్యాంక్  లకు రిజర్వ్ బ్యాంక్ భారీ షాక్ ఇచ్చింది. రెండు బ్యాంక్ లకు రూ. 12.19 కోట్లు, 3.95 కోట్ల చొప్పున జరిమానా విధించింది. ఆర్బీఐ బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లంఘించినందువల్ల ఈ జరిమానా విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ తెలిపిన వివరాల ప్రకారం బ్యాంకింగ్ రెగ్యులేషన్ నిబంధనల్లోని సెక్షన్ 20(1) ని ఐసీఐసీఐ బ్యాంక్ ఉల్లంఘించింది. అలాగే రుణాల జారీకి సంబంధించి గతంలో ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాలను కూడా ఉల్లంఘించింది. ఐసీఐసీఐ బ్యాంక్ లో డైరెక్టర్లుగా ఉన్న ఇద్దరు వేరే కంపెనీల్లో కూడా డైరెక్టర్లుగా ఉన్నారు. 

వారు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలకు ఐసీఐసీఐ బ్యాంక్ రుణాలను ఇచ్చింది. ఇది బ్యాంకింగ్ నిబంధనలకు వ్యతిరేకం. అంతేకాకుండా, నాన్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ను సేల్ చేయడం, మార్కెటింగ్ చేయడమనే మోసాలకు కూడా ఐసీఐసీఐ బ్యాంక్ పాల్పడింది.

కొటక్ మహింద్ర బ్యాంక్ కు ఆర్బీఐ రూ. 3.95 కోట్ల జరిమానా  విధించింది. రిస్క్ మేనేజ్ మెంట్, కోడ్ ఆఫ్ కండక్ట్ లకు సంబంధించి ఆర్బీఐ విధించిన నిబంధనలను ఈ బ్యాంక్ అతిక్రమించింది. బ్యాంక్ లు రికవరీ ఏజెంట్లను నియమించుకోవడానికి సంబంధించిన నిబంధనలను, రుణాల జారీకి సంబంధించిన రూల్స్ ను కూడా ఉల్లంఘించింది. 

రుణం తీసుకున్న వ్యక్తి నుంచి లోన్ ఇవ్వడానికి అంగీకరించిన తేదీ నుంచి వడ్డీ వసూలు చేసింది. నిజానికి, ఆ రుణాన్ని ఆ వ్యక్తి ఖాతాలో జమ చేసిన నాటి నుంచి వడ్డీని లెక్కించాలి. అలాగే, ప్రి క్లోజర్ నిబంధనలకు విరుద్ధంగా ఆ రుసుమును వసూలు చేసింది.