తెలంగాణలో జనసేన మద్దతు కోరిన బీజేపీ

తెలంగాణ ఎన్నికల్లో పోటీపై ఇంకా స్పష్టంగా నిర్ణయం తీసుకోనని జనసేన తమకు మద్దతు ఇవ్వాలని బిజెపి నేతలు కోరారు.  ఈసారి తప్పనిసరిగా పోటీ చేయాలని జనసేన నేతలు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కోరుతున్న సందర్భంలో  కేంద్ర మంత్రి, రాష్త్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, పార్టీ ఓబిసి మోర్చా అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ తో కలిసి బుధవారం పవన్ కళ్యాణ్ ను కలిసి ఈ విషయమై చర్చించారు.
 
2018 ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు దూరంగా ఉన్న జనసేనతో కలిసి తెలంగాణ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే అవకాశాలపై పవన్ కల్యాణ్ తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ చర్చలు జరిపారు. బుధవారం ఉదయం హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. 
 
ఎన్.డి.ఎలో జనసేన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై వీరు చర్చలు చేశారు. జనసేన నాయకుల మనోగతాన్ని పవన్ బీజేపీ నేతలకు వివరించారు.  తెలంగాణాలో పోటీచేసే పార్టీ అభ్యర్థులను ఖరారు చేసే విషయమై బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం సాయంత్రం ఢిల్లీలో సమావేశం కావడానికి ముందుగా ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరింప చేసుకుంది.
 
కాగా, హైదరాబాద్‌లోని జనసేన పార్టీ ఆఫీసులో తెలంగాణ నేతలు, కార్యకర్తలతో పవన్ కల్యాణ్‌ భేటీ అయ్యారు. ఎన్నికల్లో పోటీపై పార్టీ నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కొత్త రాష్ట్రంలో రాజకీయ గందరగోళానికి తావివ్వరాదని గత ఎన్నికల్లో పోటీ చేయలేదని, బీజేపీ విజ్ఞప్తి మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికలకు దూరంగా ఉన్నామని జనసేన తెలిపింది. 
 
అయితే ఇప్పుడు పరిస్థితి మారిందని ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకపోతే క్యాడర్ బలహీనపడే అవకాశం ఉందని నేతలు పవన్‌ దృష్టికి తీసుకెళ్లారు. కనీసం 30 సీట్లలో పోటీ చేయాలని స్పష్టం చేశారు. తెలంగాణ నేతల అభిప్రాయాలను తెలుసుకున్న పవన్ కల్యాణ్‌, తన మీద ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. సరైన నిర్ణయం తీసుకోవడానికి ఒకటి, రెండు రోజుల సమయం కావాలని కోరారు.