హమాస్ అధీనంలోని బందీలను తక్షణమే బేషరతుగా విడిచిపెట్టాలి

హమాస్ అధీనంలోని బందీలను తక్షణమే బేషరతుగా విడిచిపెట్టాలని ఐరాస చీఫ్ ఆంటోనియా గుటెరస్ ఓ ప్రకటనలో కోరారు. అదే సమయంలో ఇజ్రాయెల్ కూడా గాజా వాసుల కోసం సాయాన్ని తరలించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

 “ఈ నాటకీయ పరిణామాల మధ్య నేను రెండు మానవీయత విజ్ఞప్తులు చేయాలనుకుంటున్నా. హమాస్ బేషరతుగా బందీలను విడుదల చేయాలి. అదే సమయంలో ఇజ్రాయెల్ కూడా గాజా లోని ప్రజలు, కార్మికుల కోసం ఎటువంటి అవరోధాలు లేకుండా మానవతా సాయం చేరేలా చూడాలి. ఈ రెండూ చాలా ముఖ్యమైనవి. వీటిని బేరసారాల్లో ఆయుధాలుగా వాడకుండా ఉండటం సరైన పని” అని గుటెరస్ పేర్కొన్నారు.

గాజాలో నీరు, విద్యుత్, నిత్యావసరాల నిల్వలు గణనీయంగా తగ్గిపోతున్నాయని పేర్కొంటూ ఐరాసకు చెందిన ఆహారం, నీరు, ఆహారేతర వస్తువులు, ఔషధాల నిల్వలు, ఈజిప్ట్, జోర్డాన్, వెస్ట్‌బ్యాంక్, ఇజ్రాయెల్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటిని కొన్ని గంటల్లోనే గాజాకు తరలించవచ్చని పేర్కొన్నారు.  వీటిని గాజాలో నిస్వార్థంగా పనిచేస్తున్న ఐరాస సిబ్బందికి, ఎన్‌జీవోలకు అందిస్తే  వారు గాజా మొత్తానికి అందుబాటులోకి తీసుకువస్తారని పేర్కొన్నారు. సరఫరాలకు ఆటంకం లేకుండా చూడటం కీలకమని గుటెరస్ తెలిపారు. 

ఈ యుద్ధంపై ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. డబ్లుహెచ్‌వో డైరెక్టర్ టెడ్రోస్ అథనామ్ మాట్లాడుతూ  ‘హమాస్ దాడులు అతి క్రూరమైనవి. ప్రతి ఒక్కరూ ఈ దాడుల్ని ఖండించాల్సిందే. బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ ప్రజలను హమాస్ వెంటనే విడిచిపెట్టాలి’ అని కోరారు. అలాగే ఇజ్రాయెల్ దాడుల వల్ల అమాయక పాలస్తీనా ప్రజలు, చిన్నారులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని, లక్షల మంది ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హ‌మాస్ స్ధావ‌రాల‌ను నేల‌మ‌ట్టం చేయ‌డంతో పాటు ఉగ్ర‌సంస్ధ విధ్వంసం దిశ‌గా త‌మ దాడులు కొన‌సాగుతాయ‌ని ఇజ్రాయెల్ ర‌క్ష‌ణ ద‌ళాల ప్ర‌తినిధి లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ పీట‌ర్ లెర్న‌ర్ స్ప‌ష్టం చేశారు. 

హ‌మాస్ సామ‌ర్ధ్యాల‌ను, దాని మౌలిక వ‌స‌తుల‌ను ధ్వంసం చేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు ఇచ్చిన త‌ర్వాత తాము ఉగ్ర‌సంస్ధ ల‌క్ష్యంగా ప‌దిరోజుల నుంచి దాడులు చేప‌డుతున్నామ‌ని, ఇజ్రాయెల్ పౌరుల భ‌ద్ర‌తను పున‌రుద్ధ‌రించే దిశ‌గా ముందుకు వెళుతున్నామ‌ని చెప్పారు. తామిప్ప‌టికే ప‌లువురు ఉగ్ర‌వాదుల‌తో పాటు హ‌మాస్ నేత‌ల‌ను హ‌త‌మార్చామ‌ని వెల్ల‌డించారు.