గాజాను విడిచివెళ్లిన 10 లక్షల మంది

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధం పదో రోజుకు చేరింది. ఇప్పటివరకు ఆకాశ మార్గంలో హమాస్‌కు కేంద్రంగా ఉన్న గాజాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ సైన్యం గ్రౌండ్‌ ఆపరేషన్‌కు సిద్ధమైంది. గాజా సరిహద్దు వెంబడి 30 వేల మందికిపై బలగాలను మోహరించింది. రాజకీయ ఆమోదం వచ్చిన వెంటనే దాడులకు సర్వం సిద్ధం చేసుకున్నది. 
 
ఈ నేపథ్యంలో 10 లక్షలకు పైగా సామాన్య ప్రజలు యుద్ధ క్షేత్రమైన గాజాను విడిచి వెళ్లారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. గ్రౌండ్‌ ఆపరేషన్‌తో హమాస్‌ గ్రూపు టాప్‌ రాజకీయ, సైనిక నాయకత్వాన్ని హతమార్చడం ద్వారా గాజాను పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకోవాలని ఇజ్రాయెల్‌ లక్ష్యంగా పెట్టుకొన్నది.  గాజాలో మొత్తం జనాభా 24 లక్షలు.
మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదివారం అత్యవసర మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ ప్రతిపక్ష శాసనసభ్యులు కూడా పాల్గొన్నారు. ఇజ్రాయెల్ అధికారులు గాజాపై ఏదైనా భూదాడి చేయాలంటే అది “రాజకీయ నిర్ణయం”పై ఆధారపడి ఉంటుందని నెతన్యాహు తెలిపారు. హమాస్‌లోని సొరంగాలు, భూగర్భ బంకర్లలో కిడ్నాప్ చేసిన ఇజ్రాయెల్ పౌరులను దాచినట్టుగా ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సొరంగాలు, భూగర్భ బంకర్లలో బందీలుగా ఉన్న తమ 150 మందిని రక్షించడం ఇజ్రాయెల్ సైన్యానికి సవాలుగా మారింది.

ఇజ్రాయెల్‌లోకి హమాస్‌ మిలిటెంట్ల చొరబాటు సూత్రధారి, కిబ్బుట్జ్‌ నిరిమ్‌లో ఊచకోతకు బాధ్యుడైన బిల్లాల్‌ అల్‌ కేద్రాను ఖాన్‌ యూనిస్‌ పట్టణంపై జరిపిన దాడుల్లో చంపేశామని ఇజ్రాయెల్‌ వైమానిక దళం ఓ ప్రకటించింది. ఈనెల 7న హమాస్‌ జరిపిన దాడుల్లో భారత సంతతికి చెందిన ఇద్దరు ఇజ్రాయెలీ మహిళా సెక్యూరిటీ అధికారులు మరణించారని అధికారిక వర్గాలు తాజాగా వెల్లడించాయి. 

యుద్ధంలో రెండు వైపులా మరణాల సంఖ్య 5,200కు పైగా చేరింది. 2,329 మంది పాలస్తీనియన్లు చనిపోయినట్టు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 9 వేల మందికిపైగా గాయప‌డ్డారు. ఇజ్రాయెల్‌లో 1300కి పైగా మరణించగా, ఇజ్రాయెల్‌ దాడుల్లో 1500 మంది హమాస్‌ మిలిటెంట్లు హతమయ్యారు.

కాగా, గాజాపై బాంబు దాడులు ఆపకపోతే తాము యుద్ధంలోకి దిగాల్సి వస్తుందని ఇజ్రాయెల్‌ను ఇరాన్‌ హెచ్చరించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ద్వారా ఇజ్రాయెల్‌కు ఇరాన్‌ ఓ ప్రైవేటు సందేశం పంపిందని జెరూసలేం పోస్టు వెల్లడించింది.  గాజాపై ఇజ్రాయెల్‌ సైన్యం బాంబు దాడులు ఆపాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఇరాన్‌ అందులో హెచ్చరించింది. ఐరాస సమన్వయకర్త టోర్‌ వెన్నెస్‌ల్యాండ్‌ను ఇరాన్‌ విదేశాంగ శాఖ మంత్రి హుస్సేన్‌ లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో కలిసారు. యుద్ధ పరిస్థితిపై చర్చించారు.