మార్గదర్శి వివాదంలో రామోజీరావుపై సిఐడి మరో కేసు

మార్గదర్శి చిట్ ఫండ్ ఛైర్మన్ రామోజీరావుపై షేర్ల బదిలీ వివాదంపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీకి మరో కేసు నమోదు చేసింది.  మార్గదర్శి వ్యవస్థాపకులలో ఒకరైన జి.జగన్నథ రెడ్డి కుమారుడు గాదిరెడ్డి యూరిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావు, ఆయన కోడలు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండి శైలజా కిరణ్‌లపై ఎపి సిఐడి కేసు నమోదు చేసింది. 

సెక్షన్ 420, 467, 120-8, రెడ్ విత్ 34 ఐపిసి కింద కేసు నమోదైంది. కేసులో ఎ1గా రామోజీరావు, ఎ2గా శైలజా కిరణ్ ను చేర్చారు. మార్గదర్శిలో తమ షేర్ల వాటాను శైలజ పేరు మీదకి మార్చారని, తనను బెదిరించి బలవంతంగా తన వాటా లాక్కున్నారని యూరిరెడ్డి తన ఫిర్యాదులో వెల్లడించారు. తన వాటా షేర్లు రాసివ్వడానికి నిరాకరించడంతో రామోజీరావు తుపాకీతో తనను బెదిరించి, బలవంతంగా లాక్కున్నారని యూరిరెడ్డి ఆరోపిస్తున్నారు. 

2016 నాటికి తన పేరు మీద ఉన్న షేర్ల విలువ రూ.1,59,69,600 ( కోటి 59 లక్షల 69 వేలు) కాగా, రామోజీరావు కేవలం రూ.39,74,000 (39 లక్షల 74 వేలు) యూనియన్ బ్యాంక్ చెక్కు ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తాను సంతకం పెట్టలేదని, తన సంతకం ఫోర్జరీ చేసి తన పేరిట ఉన్న వాటాలను తమకు సంబంధించిన వారి పేరిట మార్చారని యూరిరెడ్డి ఫిర్యాదులో తెలిపారు. 

1962లో మార్గదర్శి చిట్ ఫండ్ పెట్టిన సమయంలో తన తండ్రి జగన్నాథరెడ్డి రూ.5 వేలు పెట్టుబడి పెట్టారని చెప్పారు. అందుకుగానూ మార్గదర్శిలో తండ్రి జగన్నాథరెడ్డి పేరిట కొన్ని షేర్లు రామోజీరావు ఇచ్చారని తెలిపారు. తన తండ్రికి మార్గదర్శిలో షేర్లు ఉన్నాయని తెలిసి అపాయింట్ మెంట్ కోరగా చాలాకాలం రామోజీరావు తమను కలిసేందుకు ఇష్టపడలేదని తెలిపారు. 

29 సెప్టెంబర్ 2016లో రామోజీరావును కలిసిన సమయంలో బెదిరించి తన వాటా రాయించుకున్నారని యూరిరెడ్డి ఆరోపిస్తున్నారు. యూరి రెడ్డి ఫిర్యాదుతో ఎపి సిఐడి పోలీసులు కేసు నమోదు చేయగానే రామోజీ రావు వెంటనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ క్వాష్ పిటిషన్ మంగళవారం హైకోర్టు ముందు విచారణకు రాబోతోంది.