గన్‌మెన్‌లను తిప్పిపంపిన మాజీ మంత్రి బాలినేని

మంత్రిమండలి నుండి తొలగించినప్పటి నుండి అసహనంగా వ్యవహరిస్తూ, పార్టీ బాధ్యతలకు దూరంగా ఉంటూ వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీప బంధువు, ఒంగోలు ఎమ్యెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తరచూ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపట్ల కూడా తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాజాగా, ఒంగోలు పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 
 
ఇటీవల ప్రకాశం జిల్లాలో నకిలీ భూ దస్తావేజుల కేసులో పోలీసుల వ్యవహారశైలిని తప్పుబట్టారు. పోలీసుల తీరుకు నిరసనగా గన్‌మెన్‌లను ప్రభుత్వానికి తక్షణమే సరెండర్‌ చేస్తున్నట్లు రాష్ట్ర డీజీపీకి బాలినేని లేఖ రాశారు. ఈ కేసులో ఉన్న ఎంతటి వారినైనా అరెస్టు చేయాల్సిందేనని, ఈ కేసులో ఉన్నది అధికార పార్టీ నేతలనైనా వదిలిపెట్టవద్ని స్పష్టం చేశారు. 
 
అసలు దోషుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.  తన రాజకీయ జీవితంలో ఇలాంటి తీరును ఎప్పుడూ చూడలేదని, నాలుగేళ్ల నుంచే ఇలాంటి విచిత్ర పరిస్థితులు చూస్తున్నాను అంటూ నేరుగా జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు.  పోలీసులు తన సూచనను పెడచెవిన పెడుతున్నారని, తక్షణం తన గన్‌మెన్‌లను సరెండర్‌ చేస్తున్నట్లు తెలిపారు.
ప్రకాశం జిల్లాలో కలకలం రేపిన నకిలీ భూపత్రాల కేసులో పోలీసులు 10 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో ఎంతటి వారినైనా వదిలిపెట్టవద్దని గతంలోనే బానేలిని ఎస్పీని కోరారు. ఈ కేసులో తన పక్కనున్న వారినైనా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవద్దన్నారు. పోలీసులు అనధికారికంగా కొన్ని పేర్లు చెబుతున్నారని పేర్కొంటూ ఈలోపు గన్‌మెన్‌లను సరెండర్ చేస్తూ లేఖ రాయడం కలకలంరేపింది.

నకిలీ పత్రాల వ్యవహారంలో ఇప్పటికే ప్రధాన సూత్రధారి పూర్ణచంద్రరావుతో మరో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మిగిలిన వారిపై కూడా ఫోకస్ పెట్టారు. నకిలీ పట్టాలు తయారు చేసి భూవివాదాలకు పాల్పడుతున్న ముఠాలపై కూడా సిట్‌ ఆరా తీస్తోంది. ఇప్పటికే అందిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు.