తెలంగాణ‌లో అధికారం మాదే.. బిజెపి ధీమా

తెలంగాణ‌లో అధికారం మాదే.. బిజెపి ధీమా
 
అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తామని కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ”తెలంగాణలో అవినీతి, కుటుంబ పాలన తుడిచిపెట్టాలని ప్రధాని మోదీ చెప్పారు. రెండో, మూడో స్థానాల కోసం బిఆర్ఎస్, కాంగ్రెస్‌ పోటీపడాలి. అధికారాన్ని, డబ్బును ఉపయోగించి కేసీఆర్‌ ఎన్నికలకు వెళ్తున్నారు” అని స్పష్టం చేశారు. 
 
సకల జనుల పాలన తెలంగాణలో రావాలని చెబుతూ బీజేపీతోనే సకల జనుల పాలన సాధ్యం అని తెలిపారు. ఎన్నికలకు బిజెపి సిద్ధంగా ఉందని పేర్కొంటూ ఎన్నికల్లో బిజెపిని ప్రజలు ఆశీర్వదించాలని కిషన్‌ రెడ్డి కోరారు.  ‘‘తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం ఐక్యమంతంగా పోరాటం చేస్తాం. పూర్తి విశ్వాసం మాకుంది.‌ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తాం” అంటూ భరోసా వ్యక్తం చేశారు. 
 
కుటుంబ, నియంతృత్వ, దుర్మార్గపు, ప్రభుత్వం పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి చెప్పారు. తెలంగాణలో నిబద్ధ విప్లవం వస్తుందని చెబుతూ ఉద్యమ ద్రోహులు ఫామ్‌హౌస్, ప్రగతి భవన్‌లో చేరారని ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీకి మద్దతు ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారని పేర్కొంటూ డబ్బు, మద్యం, ప్రభావం లేకుండా ఎన్నికలు జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
 
సీనియ‌ర్ నేత ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యేలను అంగట్లో సరకులా అమ్ముతున్నారని విమర్శించారు. ఎన్నికలను డబ్బుమయం చేసింది కేసీఆరే అంటూ ఒక్కో నియోజకవర్గంలో రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్లు ఖర్చు పెట్టాలని కేసీఆర్‌ నిర్ణయించారని ఆరోపంచారు. తమకు ఓటేస్తేనే దళితబంధు, పింఛన్‌ వస్తుందని భారాస నేతలు భయపెడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ లేకుండా తెలంగాణ వచ్చేది కాదని ఈటల గుర్తు చేశారు.