మాజీ మంత్రి శంకర్ నారాయణపై డిటోనేటర్ తో దాడి

మాజీ మంత్రి, పెనుకొండ వైసీపీ ఎమ్మెల్యే శంకర్ నారాయణపై ఓ దుండగుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. శంకర్ నారాయణ కారుపై పేలుడు పదార్థాలతో దాడికి యత్నించాడు. అయితే అవి పేలకపోవటంతో శంకర్ నారాయణకు పెను ప్రమాదం తప్పింది. గోరంట్ల మండలం గడ్డం తాండాలో శంకర్ నారాయణ పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగింది.

గడప గడపకు కార్యక్రమం 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన గోరంట్ల మండలంలో పార్టీ శ్రేణులతో కలిసి సంబరాలు చేసుకుంటూ ఆదివారం ర్యాలీ చేస్తున్నారు. పార్టీ శ్రేణులతో ఊరిగింపుగా వెళ్తున్న ఎమ్మెల్యే కారుపై గుర్తు తెలియని దుండగులు బాంబులతో దాడి చేశారు. దీంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు తలెత్తాయి.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. శంకర్ నారాయణపై డిటోనేటర్ విసిరినట్లు పోలీసుల ప్రాథమికంగా నిర్థారించారు. పవర్ సప్లై లేకపోవడంతో ఆ డిటోనేటర్ పేలలేదన్నారు.  మద్యం మత్తులో యువకుడు డిటోనేటర్ విసిరినట్లు పోలీసులు భావిస్తున్నారు. 
దుండగుడు గణేష్ సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామానితి చెందినవాడని పోలీసులు గుర్తించారు. 
 
వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తెలియజేసి, ప్రజా సమస్యలు పరిష్కరించానని శంకర్ నారాయణ తెలిపారు. తనపై హత్యాయత్నం వెనుక ఎవరున్నారో తేలాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ కుట్ర కోణాన్ని పోలీసులు ఛేదించాలని డిమాండ్ చేశారు. 
 
దేవుడి దయతో తాను ప్రమాదం నుంచి బయటపడ్డానని శంకర్ నారాయణ తెలిపారు. డిటోనేటర్ పేలి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఈ దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్యే ఆరోపించారు.