సిరియాలో మిలిటరీ అకాడమీపై డ్రోన్ల దాడిలో వందమంది మృతి

సిరియాలో మిలిటరీ అకాడమీపై డ్రోన్ల దాడి జరిగి 100 మందికిపైగా మృతి చెందారు. సుమారు 200 మందికి గాయపడ్డారు. హౌమ్స్‌ ప్రావిన్స్‌లో సైనిక కళాశాల గ్రాడ్యుయేషన్‌ వేడుక జరుగుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. చనిపోయినవారిలో మిలిటరీ క్యాడెట్స్‌ కుటుంబ సభ్యులు, మహిళలు, చిన్నారులు ఉన్నారు. 
 
సిరియా అంతర్యుద్ధంలో ప్రభుత్వంతో పోరాడుతున్న తిరుగుబాటుదారులుగానీ, జిహాదిస్టులు గాన ఈ దాడిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే, సాయుధ ఉగ్ర సంస్థలే గ్రాడ్యుయేషన్‌ డేను లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడినట్లు సిరియా మిలిటరీ ఆరోపించింది. మిలిటరీ కాలేజీలో శిక్షణ పూర్తికావడంతో గురువారం క్యాడెట్స్‌కు గ్రాడ్యుయేషన్‌ డేను నిర్వహించారు.
ఈ వేడుకకు వారి కుటుంబ సభ్యులు, సైనిక అధికారులు భారీ ఎత్తున తరలివచ్చారు. వేడుక ముగిశాక అధికారులు, మిలిటరీ క్యాడెట్స్‌ అక్కడి ప్రాంతం నుంచి బయటకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.  డ్రోన్‌ దాడి చేసుకోవడంతో అందరూ ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ఆ ప్రాంతమంతా రక్తపు గాయాలతో, హాహాకారాలతో నిండిపోయింది.
బాధితుల ఆర్తనాదాలతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.  ఘటనా స్థలానికి చేరుకున్న సైనికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పేలుడు పదార్థాలు కలిగిన డ్రోన్‌తో మిలిటరీ అకాడమీని లక్ష్యంగా చేసుకొని దాడి చేసినట్లు సిరియా మిలిటరీ పేర్కొన్నట్లు స్థానిక మీడియా సంస్థలు తెలిపాయి. ఈ దాడికి ప్రతిచర్య తప్పబోదని, ఉగ్రవాద గ్రూపులు ఎక్కడ ఉన్నా ప్రతిస్పందన ఉంటుందని ఆ దేశ ఆర్మీ హెచ్చరించింది. 
 
మృతుల్లో ఆరుగురు మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి హసన్‌ అల్‌ గబ్బాష్‌ తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ వేడుకకు సిరియా రక్షణ శాఖ మంత్రి కూడా హాజరయ్యారు. అయితే, ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయిన కొన్ని నిమిషాలకే ఈ దాడి జరిగింది. శుక్రవారం నుంచి మూడు రోజులపాటు సంతాప దినాలు పాటిస్తున్నట్లు సిరియా ప్రభుత్వం ప్రకటించింది.