బిఆర్‌ఎస్ ఎన్‌డిఎలో చేరాలని అనుకున్నది నిజం

బిఆర్‌ఎస్ ఎన్‌డిఎలో చేరాలని అనుకున్నది నిజం, కెటిఆర్‌ను ముఖ్యమంత్రి చేసి కెసిఆర్ కేంద్రంలో మంత్రి అవ్వాలి అనుకున్నది నిజం అని  బిజెపి తెలంగాణ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. విశ్వాసానికి మారుపేరు ప్రధాని నరేంద్ర మోదీ అంటూ ఆయనను విమర్శించడం సూర్యుని మీద ఉమ్మి వేయడమే అని ధ్వజమెత్తారు. 
 
కవిత ఎంపిగా పోటీచేసిన నాడు కవితని గెలిపించండి నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తా అన్నారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? అని ప్రశ్నించారు. చరిత్ర తీయండి. దళితుడిని సీఎం చేస్తానని మోసం చేసి, దళితబంధు కింద రూ. 10 లక్షలు ఇస్తామని చెప్పి సరిగ్గా అమలు చేయని ముఖ్యమంత్రి విశ్వాస ఘాతకుడని రాజేందర్ దుయ్యబట్టారు. 
 
చీటింగ్ లో కేసీఆర్ నెంబర్ వన్ అంటూ మండిపడ్డారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన మంత్రి హరీశ్ రావు  ప్రధాని ప్లెక్సీని చించేసి, టీవీని పగలగొట్టి కుసంస్కారానికి ఒడిగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలని అడగాలి తప్పితే ప్రధాని ఫోటోను చించివేయడం సిగ్గుమాలిన చర్య అని ధ్వజమెత్తారు.

బీఆర్ఎస్ నేతలు సంస్కారవంతులైతే మోదీ గారి బొమ్మ ఎందుకు పెట్టలేదు? అని ఈటెల ప్రశ్నించారు.  కేంద్రం బియ్యం ఇస్తే ఫ్లెక్సీల్లో ప్రధాని మోదీ బొమ్మ పెట్టకుండా కేసీఆర్ ఫోటో పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. “తెలంగాణ ప్రజల గుండెల్లో మీ ఫోటో ఉండదు. తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేది మోదీ గారు మాత్రమే” అని స్పష్టం చేశారు.

 
దళిత ముఖ్యమంత్రి, దళిత బందు, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పింది ఎవరు? అంటూ  నిలదీశారు. గౌరవ ప్రధాన మంత్రిని కేటీఆర్ చీటర్ అంటూ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అంటూ  ఇచ్చిన హామీలను విస్మరించిన వారు పెద్ద చీటర్ అంటూ రాజేందర్ మండిపడ్డారు. 
 
కేసీఆర్ ఏ పార్టీకీ ఎంత డబ్బు పంపింది ప్రధానికి తెలియదా? నీకే నిఘా వ్యవస్థ ఉంటే ప్రధానికి ఉండదా? ప్రధాని ఆధారాలు లేకుండా మాట్లాడుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయం వచ్చినప్పుడు అన్ని బయటపడుతాయని హెచ్చరించారు. అవినీతి లేని రాష్ట్రం అంటున్నారని పేర్కొంటూ అదే నిజమైతే బిఆర్ఎస్ కు రూ 900 కోట్ల నిధులు ఏవిధంగా వచ్చాయని రాజేందర్ ప్రశ్నించారు.
 
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టలేదని పేర్కొంటూ రైతుల సంక్షేమం కోసం మూతపడ్డ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పున: ప్రారంభించింది కేంద్రం అని చెప్పారు.  రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పున ప్రారంభించేందుకు ప్రధాని మోదీ తెలంగాణకు వస్తే ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని కేసీఆర్ విమర్శించారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అపసవ్యంగా నడుస్తుందనే నరేంద్ర మోదీ కేసీఆర్ ను దూరం పెట్టారని తెలిపారు.