
భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే బలమైన సాయుధ దళాలను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. రక్షణ శాఖ ఆర్థిక వనరులను త్రివిధ దళాలు సమర్థంగా వినియోగించుకోవాలని చెప్పారు.
ఢిల్లీలో నిర్వహించిన డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ 276 వ వార్షిక దినోత్సవ వేడుకల్లో రాజ్‌నాథ్ పాల్గొంటూ వివిధ డిజిటల్ కార్యక్రమాలను ప్రారంభించారు. డీఎడీని రక్షణ శాఖ నిధులకు సంరక్షకుడిగా అభివర్ణించిన ఆయన ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను ముందుగానే గుర్తించి వెంటనే సమీక్షించగలిగేలా అంతర్గత నిఘా యంత్రాంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
దీనివల్ల కేవలం సమస్యలు త్వరగా పరిష్కారం కావడమే కాకుండా ప్రజలకు రక్షణ వ్యవస్థపై నమ్మకం కలుగుతుందని చెప్పారు. “మనం అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరాలంటే కచ్చితంగా బలమైన సాయుధ బలగాలను, రక్షణ పరికరాలను సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం అందుబాటులో ఉన్న రక్షణశాఖ నిధులను సమర్ధంగా వినియోగించుకోవాలి” అని రక్షణ మంత్రి తెలిపారు.
డిమాండ్, సర్వీస్, నిధుల మధ్య సమతూకం పాటించాలని రాజ్‌నాథ్ తెలిపారు. మార్కెట్ లోని వివిధ అంశాలను పరిశోధించి, అధ్యయనం చేయగలిగిన అధికారులను గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. దీనికోసం అంతర్గత స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని, డీఏడీకి రాజ్‌నాథ్ సూచించారు.
అత్యంత పారదర్శకతతో , సమర్థవంతమైన ఆర్థిక వ్యవస్థ ద్వారా దేశ రక్షణ సామర్థాలను పెంపొందించే దిశగా సంస్థ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. రక్షణ శాఖకు సంబంధించి ఆర్థిక సలహాలను అందించే క్రమంలో డీఏడీ అధికారులు ముఖ్యంగా రెండు అంశాలను గుర్తుంచుకోవాలని రాజ్‌నాథ్ సూచించారు.
ఏదైనా పరికరం గానీ, టెక్నాలజీ గానీ కొనుగోలు చేయాల్సి వస్తే , అది ఎంతవరకు అవసరం? ఎంతవరకు ఖర్చు చేయొచ్చు? అనే అంశాలపై డీఏడీ అధికారులకు స్పష్టమైన అవగాహన ఉండాలని చెప్పారు. అదే ప్రొడక్ట్ వేరే చోట తక్కువ ధరకే దొరుకుతున్నట్టయితే కచ్చితంగా ఆ అంశాన్ని పరిగణన లోకి తీసుకోవాలని సూచించారు. స్టాండింగ్ కమిటీలు దీనికి ఉపకరిస్తాయని రాజ్‌నాథ్ చెప్పారు.
పెద్ద పెద్ద బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అంతర్గత పరిశోధన బృందాలను ఏర్పాటు చేస్తాయని, వాటిలాగే మార్కెట్‌ను శోధించేందుకు డీఏడీ కూడా తమ సంస్థలో ఒక బృందాన్ని అభివృద్ధి చేయాలని రాజ్‌నాథ్ సూచించారు.
More Stories
బెంగాల్ ప్రతిపక్ష నేత బడ్జెట్ సమావేశాల్లో సస్పెన్షన్
`చైనా శత్రువు’ కాదన్న పిట్రోడా వాఖ్యలపై దుమారం
ఢిల్లీ కొత్త సీఎం 20న ప్రమాణస్వీకారం!