`సనాతన’ దుమారంపై ఇద్దరు మంత్రులను తొలగించండి

 
* తమిళనాడు గవర్నర్ కు విశ్వహిందూ పరిషద్ విజ్ఞప్తి
 
`సనాతన నిర్ములన సదస్సు’ పేరుతో చెన్నైలో సదస్సు నిర్వహించిన తీరుపట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, దీనికి హాజరైన ఇద్దరు తమిళ నాడు మంత్రులను మంత్రివర్గం నుండి తొలగించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఆ మేరకు  అఖిల భారతీయ సంత్ సమితి ప్రధాన కార్యదర్శి దండి స్వామి జీతేంద్రానంద సరస్వతి నేతృత్వంలోని ఉన్నత స్థాయి  ప్రతినిధి బృందం రాష్త్ర గవర్నర్ ఆర్ ఎన్ రవిని కలిసి వినతిపత్రం సమర్పించింది.
 
వెల్లిమలై ఆశ్రమానికి చెందిన స్వామి చైతన్యానంద స్వామి మధురానంద, పరిషత్ సెంట్రల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్, ఉత్తర తమిళనాడు అధ్యక్షుడు డాక్టర్ పి చొక్కలింగం అధ్యక్షుడు, లీగల్ సెల్ సెంట్రల్ కో కన్వీనర్ శ్రీనివాసన్ లతో కూడిన ప్రతినిధి వర్గం గవర్నర్ ను కలిసి రాష్ట్రంలో ఇటీవల సనాతన ధర్మంపై జరుగుతున్న దాడుల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
 
`సనాతన నిర్ములన సదస్సు’కు మంత్రివర్గంలో ముఖ్యమంత్రి కుమారుడైన మంత్రి ఉదయనిధి స్టాలిన్ హాజరు కావడంతో పరిస్థితి తీవ్రతను మరింత జటిలం కావించినట్లు వారు తెలిపారు. సనాతన ధర్మాన్ని రోజురోజుకు తప్పుడు భావాలతో లక్ష్యంగా చేసుకుని లక్షలాది మంది అనుచరుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
 
సమాజంలో విద్వేషాలను రెచ్చగొడుతున్న ఇటువంటి దేశవ్యతిరేక శక్తులను అరికట్టాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంను ఆదేశించాలని ప్రతినిధి బృందం గవర్నర్‌ను అభ్యర్థించింది.  డీఎంకే పార్టీకి చెందిన మంత్రులు, పార్లమెంటు సభ్యులు, వారి మిత్రపక్షమైన కాంగ్రెస్‌తో సహా ఇటువంటి అనుచిత వాఖ్యలు చేస్తున్నారని వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
సనాతన ధర్మాన్ని నిర్మూలించేందుకు జరిపిన సదస్సులో మానవవనరుల మంత్రి పాల్గొనడం, సనాతన ధర్మం నిర్ములించాలనే పిలుపుకు బాసటగా నిలబడటం మరింత అరిష్టదాయకం కావిస్తోందని అలోక్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తమిళనాడులో ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనల ప్రకారం పనిచేయడంలేదని భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయని ఆయన తెలిపారు.
 
రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిణామాలను భారత రాష్ట్రపతికి నివేదిక రూపంలో పంపాలని గవర్నర్ ను ప్రతినిధి బృందం కోరింది. రాజ్యాంగం ప్రకారం తాము చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించినందున ఇద్దరు మంత్రులను మంత్రి మండలి నుండి తొలగించాలని గవర్నర్‌ను వారు అభ్యర్థించారు.