చంద్రయాన్ 3 కథ ముగిసిందా?

చంద్రుడిపై నిగూఢ రహస్యాలు కనుగొనేందుకు ఈ ఏడాది భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ కథ ముగిసినట్లే కనిపిస్తుంది. భూమిపై నుంచి ప్రయోగించిన తర్వాత 40 రోజుల పాటు ప్రయాణం చేసి ఆగస్టు 23న చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్ అయి అక్కడి నుంచి ఫొటోలు, వీడియోలు పంపించింది. 
 
అక్కడ 150 మీటర్ల పాటు ప్రయాణించిన రోవర్, ల్యాండర్ కూడా పరస్పరం ఫొటోలు తీసుకుని పంపాయి. అలాగే అక్కడి మూలకాల ఆనవాళ్లను కూడా పంపాయి. ఆ తర్వాత నిద్రలోకి జారుకున్నాయి. ఇప్పుడు ఏకంగా శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రయాన్ 3 మిషన్‌లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో తిరిగి సంబంధాలు పునరుద్ధరించలేకపోయింది.
అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ చంద్రుడి ఉపరితలంపై ఉన్న ల్యాండర్, రోవర్ నుంచి ఎటువంటి సంకేతాలు అందలేదు. ఇది అంతరిక్షంలో 40 రోజుల ప్రయాణం తర్వాత ఆగస్టు 23న చంద్రయాన్ 3 చంద్రుడి దక్షిణ ధృవం వద్ద అడుగుపెట్టింది. ఆ తర్వాత 14 రోజుల పాటు పరిశోధనలు సాగించాక నిద్రలోకి జారుకుంది.
భూమిపై 14 రోజులతో సమానమైన చంద్రుడిపై ఒక్క రోజు రాత్రి కావడంతో అతి శీతల వాతావరణంలోకి చేరుకున్న చంద్రయాన్ 3 ల్యాండర్, రోవర్ రెండూ మంచుతో కప్పబడిపోయాయి. ఆ తర్వాత తిరిగి పగలు కావడంతో భూమిపై 14 రోజుల తర్వాత తిరిగి ఈ రెండూ నిద్ర లేస్తాయని అంతా భావించారు. ఇస్రో కూడా వీటితో కనెక్టివిటీ పునరుద్ధరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయినా అక్కడి నుంచి ఎలాంటి సిగ్నల్స్ రాకపోవడంతో ఇక చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ శాశ్వతంగా నిద్రలోకి జారుకున్నట్లవుతోంది.
విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్ తమకు అప్పగించిన పనుల్ని పూర్తి చేశాక సెప్టెంబర్ 2న స్లీప్ మోడ్‌లోకి చేరాయి. రోవర్ శివశక్తి పాయింట్ నుండి చంద్రుని ఉపరితలంపై 100 మీటర్లకు పైగా ప్రయాణించి, చంద్రునిపై సల్ఫర్, ఇనుము, ఆక్సిజన్ , ఇతర మూలకాల ఉనికిని కనుగొంది.  ఆ తర్వాత మాత్రం నిద్రలోకి జారుకుని ఇక లేవలేదు. సెప్టెంబరు 30న జరగనున్న తదుపరి చంద్ర సూర్యాస్తమయం వరకు ల్యాండర్, రోవర్‌తో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఇస్రో తన ప్రయత్నాలను కొనసాగిస్తుంది.

ల్యాండర్, రోవర్ పార్క్ చేసిన శివశక్తి పాయింట్‌లో సూర్యోదయం, పరికరాలను తిరిగి తీసుకువస్తుందని ఇస్రో ఇప్పటికీ ఆశాభావంతో ఉంది. అయితే ప్రస్తుతానికి చంద్రయాన్-3 పరికరాలతో కనెక్టివిటీ ఎప్పుడు ఏర్పడుతుందనేది అనిశ్చితంగానే ఉంది.  ఇప్పటికీ వాటిని పింగ్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తామని ఇస్రో తెలిపింది. కానీ ప్రస్తుతానికి మాత్రం ఎలాంటి కమ్యూనికేషన్ లేదని తెలుస్తోంది. సుదీర్ఘ రాత్రి సమయంలో కఠినమైన చంద్ర వాతావరణం కారణంగా వీటి పునరుద్ధరణ అవకాశాలు ఎల్లప్పుడూ తక్కువగా ఉంటాయి.