గడ్చిరోలిలో మావోయిస్టుల కుట్ర భగ్నం

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. అటవీ ప్రాంతంలో రహస్యంగా దాచి పెట్టిన మందుపాతరను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మావోయిస్టుల వారోత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో భారీ దాడులకు ప్రణాళిక రూపొందించి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కుర్ఖెడ సబ్‌ డివిజన్‌ పరిధిలోని పోమ్కే బెడ్‌గావ్ ప్రాంతంలో, బెడ్‌గావ్ ఘాట్ అటవీ ప్రాంతంలో పోలీసు పార్టీ స్పెషల్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్న సమయంలో మందుపాతరను స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలకు నష్టం కలిగించే ఉద్దేశంతో మందుపాతరను పెట్టినట్లుగా అనుమానిస్తున్నారు. 

ఆపరేషన్‌ నిర్వహిస్తున్న సమయంలో డీఎస్‌ఎండీ పరికరంతో సెర్చ్‌ చేస్తున్న సమయంలో మందుపాతర బయటపడింది. ఆ తర్వాత అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఆపరేషన్స్) సమాచారం అందించగా బీడీడీఎస్ బృందాన్ని ఘటనా స్థలానికి రప్పించారు. తర్వాత మందుపాతరలో నాలుగు పౌచ్‌లను గుర్తించారు. 

వాటిని ఒకటిన్నర, రెండు అడుగుల లోతులో 11.8 కిలోల భారీ పేలుడు పదార్థాలు పాతిపెట్టారన్నారు. మరో వైపు మావోయిస్టులు అసాంఘిక లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసులు సూచించారు. హింసామార్గాన్ని ఇప్పటికైనా వీడాలని, లొంగిపోయి గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని మావోయిస్టులకు సూచించారు.