మణిపూర్‌లో ఇంర్నెట్‌ సేవలు పునరుద్ధరణ

మణిపూర్‌లో ఎట్టకేలకు ఇంర్నెట్‌ సేవలు పునరుద్ధరించబడ్డాయి. మే 3 నుంచి ఆ రాష్ట్రంలో మైతీలు, కుకీల మధ్య హింసాకాండ చెలరేగడంతో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, అనేకమంది తీవ్ర గాయాల పాలైన సంగతి తెలిసిందే.  కొండ ప్రాంతాలకు కుకీలు, మైదాన ప్రాంతాలకు మైతీలు పరిమితమయ్యారు. నేటికీ దాడులు జరుగుతూనే ఉన్నాయి.

శనివారం నుంచి మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ ప్రకటించారు.  ద్వేషపూరిత ప్రసంగాల వ్యాప్తి, అబద్ధపు ప్రచారాలను అరికట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం మే 3 నుంచి మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసిందని ఆయన గుర్తు చేశారు. పరిస్థితి మెరుగుపడడంతో రాష్ట్రవ్యాప్తంగా మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలు పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. 

మణిపూర్‌కి అక్రమ వలసలు కొనసాగుతున్నాయని చెబుతూ వాటిని అరికట్టేందుకు మణిపూర్‌లోని అంతర్జాతీయ సరిహద్దులో 60 కిలోమీటర్ల మేర కంచె వేయడానికి కేంద్ర హోంమంత్రిత్వశాఖ చర్యలు చేపట్టిందని  ముఖ్యమంత్రి వెల్లడించారు.  అక్రమ వలసదారుల చొరబాటును అడ్డుకోవడం, ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం, నల్లమందు సాగుకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టడంపై దృష్టి సారించినట్లు ఈ సందర్భంగా బీరెన్‌సింగ్‌ చెప్పారు.  

కాగా, మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. బెయిలుపై విడుదలైన ఐదుగురు విలేజ్‌ డిఫెన్స్‌ వలంటీర్లలో ఒకరిని కేంద్ర భద్రతా సంస్థ తిరిగి అరెస్ట్‌ చేయడంతో శుక్రవారం రాత్రి అల్లర్లు చెలరేగాయి. సెక్యూరిటీ దళాలు, నిరసనకారుల మధ్య ఇంఫాల్‌ పశ్చిమ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి.

బెయిల్ పై విడుదలైన తర్వాత మిగతా నలుగురిని అధికారులు వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిషేధిత పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన మెయిరంగ్‌థెమ్‌ ఆనంద్‌ను తిరిగి అరెస్ట్‌ చేశారు. పదేళ్ల క్రితం నాటి కేసులో తన భర్తను అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు తమతో చెప్పారంటూ ఇంఫాల్‌ పోలీస్‌ స్టేషన్‌ బయట ఆనంద్‌ భార్య విలపిస్తూ చెప్పారు.