ఈవిఎం సోర్స్‌కోడ్‌పై ఆడిట్‌ పిల్ కొట్టివేత

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవిఎం) సోర్స్‌కోడ్‌పై ఆడిట్‌ నిర్వహించాలంటూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఎన్నికల సంఘం రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించినట్లు సూచించే విధంగా ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఇది ‘విధాన సమస్య’ లోకి రాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి. పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతోకూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.

‘భారత ఎన్నికల సంఘం (ఇసిఐ)కి రాజ్యాంగబద్ధంగా ఎన్నికల నిర్వహణపై పర్యవేక్షణ, నియంత్రణను అప్పగించారు. అయితే, ఎన్నికల సంఘం నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిందని సూచించడానికి, చర్యలు తీసుకునేందుకు అవసరమైన ఎటువంటి ఆధారాలను పిటిషనర్‌ కోర్టుకు సమర్పించలేదు’ అని  ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

సోర్స్‌కోడ్‌ను ఆడిట్‌ చేయడం, నివేదికను పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచాలా? వద్దా?  అనేవి ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి వస్తాయని పేర్కొంది. ఈవిఎంలలో ఉపయోగించిన సోర్స్‌ కోడ్‌పై ఆడిట్‌ చేపట్టాలని కోరుతూ సునిల్‌ అహ్యా అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.  సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి ముందు అహ్య ఎన్నికల కమిషన్‌కు కూడా  ఫిర్యాదు చేశారు. 

సోర్స్‌ కోడ్‌ అనేది ఈవిఎంలకు ఎంతో ముఖ్యమని, ఇది ప్రజాస్వామ్య మనుగడకు సంబంధించినదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా అహ్యా   పిటిషన్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల ప్రకటన దృష్ట్యా పిల్‌లో లేవనెత్తిన అంశాలను విచారించడం సాధ్యంకాదని కోర్టు  గతంలో  పేర్కొంది.