చంద్రబాబుపై మరో కేసులో సీఐడీ పీటీ వారెంట్

 
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ స్కీంతో పాటు రాజధాని ఇన్నర్ రింగ్‌ రోడు టెండర్ల విషయంలో కేసులు నమోదు కాగా, ఇప్పుడు మరో స్కాం జరిగిందంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఏపీలో ఫైబర్‌ నెట్‌ టెండర్ల విషయంలో స్కాం జరిగిందని ఆరోపించి సీఐడీ అందులో చంద్రబాబు ప్రధాన ముద్దాయిగా చేర్చుతూ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌ దాఖలు చేసింది. 
 
ఈ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ ఫైబర్‌ నెట్‌ స్కాంలో సుమారు రూ.121 కోట్ల నిధులు దోచుకున్నారని సిట్‌ దర్యాప్తులో తేలిందని సీఐడీ చెప్తొంది. 2019 లోనే ఫైబర్‌ నెట్‌ స్కాంపై 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో ఎ1గా వేమూరి హరి ప్రసాద్‌, ఎ2 మాజీ ఎండీ సాంబశివరావుగా చేర్చింది. 
 
వేమూరి హరిప్రసాద్‌, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కావటం గమనార్హం. దీంతో ఫైబర్‌ నెట్‌ స్కాంలో చంద్రబాబు పాత్రను సీఐడీ గుర్తించింది. బ్లాక్ లిస్ట్‌లో ఉన్న టెర్రా సాఫ్ట్‌కు టెండర్లు ఇవ్వడంపై సీఐడీ విచారణ జరిపింది. నిబంధనలకు విరుద్ధంగా టెండర్‌ గడువు వారం రోజులు పొడిగించినట్లు సీఐడీ తేల్చింది. 
 బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్న టెర్రా సాఫ్ట్‌కు టెండర్‌ దక్కేలా మేమూరి చక్రం తిప్పినట్టుగా ఆరోపిస్తున్నారు. ఫైబర్‌ నెట్‌ ఫేజ్‌-1లో రూ.320 కోట్లకు టెండర్లు వేయగా అందులో రూ. 121 కోట్ల అవినీతిని సీఐడీ గుర్తించింది. టెర్రా సాఫ్ట్‌కు టెండర్లు కట్టబెట్టేందుకు అవకతవకలు జరిగినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు.
 
మరోవంక, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి. క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం రెండు రోజుల తర్వాత తీర్పు వెల్లడించనున్నట్లు ప్రకటించింది. ఈ కేసులో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 వరకు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. 
 
చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సీఐడీ తరఫున ముకుల్ రోహత్గి, రంజిత్ రెడ్డి, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు తరఫున సిద్థార్థ్ లూథ్రా, హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ఈ కేసులో చంద్రబాబుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ వర్తించదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. ఈ సెక్షన్ వర్తిస్తుందని చంద్రబాబు న్యాయవాది హరీశ్ సాల్వే వాదించారు.
 
కాగా, చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ వాయిదా వేసింది. చంద్రబాబు కస్టడీ పిటిషన్ సహా బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణను ఏసీబీ కోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ పిటిషన్లపై విచారణ వాయిదా వేసినట్లు ఏసీబీ కోర్టు తెలిపింది.