అక్టోబర్ 3 నుంచి తెలంగాణాలో ఈసీ పర్యటన

తెలంగాణలో యధావిధిగా డిసెంబర్ లో ఎన్నికలు జరిపేందుకు భారత ఎన్నికల కమిషన్ సిద్ధమవుతున్నది. కమిషన్ బృందం అక్టోబర్ 3 నుంచి 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించి రాష్ట్రంలో ఎన్నికల సన్నాహాలను సమీక్షించనుంది. దీంతో అక్టోబర్ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ప్రచారం జరుగుతోంది.
 
అక్టోబర్ 3న ఎన్నికల నిర్వహణతో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో భేటీ కానుంది. అదేవిధంగా ఎక్సైజ్, ఆదాయపన్ను, జీఎస్టీ, రవాణా, తదితర నిఘా విభాగాల అధికారులు, బ్యాంకర్లతో సమావేశం కానుంది. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టే డబ్బు, మద్యం, ఉచిత కానుకల ప్రవాహాన్ని అడ్డుకునేందుకు తీసుకునే చర్యలపై చర్చించనుంది. 
 
ఈసీ బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాల అధికారులతో సమావేశమై భద్రతా పరమైన ఏర్పాట్లపై సమీక్షించనుంది.
ఈసీ బృందం రెండో రోజు(అక్టోబర్ 4) పర్యటనలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సమావేశం కానుంది. జిల్లాల వారీగా ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించనుంది. 

అక్టోబర్ 5న కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం తెలంగాణ సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. అలాగే ఓటర్ల జాబితా, ఓటర్లకు అవగాహన, ప్రచార కార్యక్రమాల నిర్వహణ నేపథ్యంలో ప్రముఖులు, దివ్యాంగ ఓటర్లు, యువ ఓటర్లతోనూ కేంద్ర ఎన్నికల సంఘం బృందం సమావేశం కానున్నట్లు తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.

అక్టోబర్ మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తేనే తెలంగాణ ఎన్నికలు ఉంటాయని ఇటీవల మంత్రి కేటీఆర్ పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఈసీ బృందం అక్టోబర్ మొదటి వారంలో తెలంగాణలో పర్యటిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పర్యటన చివరి రోజు ఈసీ బృందం మీడియా సమావేశం పెట్టనుంది. 

దీంతో ఎన్నికల హడావుడి జోరందుకుంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ 115 అభ్యర్థులతో జాబితా విడుదల చేసింది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా సీడబ్ల్యూసీ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహించడంతో పాటు ఆరు గ్యారెంటీ పథకాలను ప్రకటించింది.

 

.