ఆసియా కప్ ఫైనల్ లో ఎనిమిదోసారి భారత్, శ్రీలంక

టైటిల్ ఫేవ‌రెట్లుగా బ‌రిలోకి దిగిన భార‌త్, డిఫెండింగ్ చాంపియన్ శ్రీ‌లంక అంచ‌నాలను అందుకుంటూ ఆసియా క‌ప్‌ చేరాయి. కొలంబోలోని ప్రేమ‌దాస స్టేడియంలో ఆదివారం  జ‌రిగే టైటిల్ పోరులో తాడోపేడో తేల్చుకోనున్నాయి. టీమిండియా, లంక ఈ టోర్నీ ఫైన‌ల్లో త‌ల‌ప‌డ‌డం ఇది ఎనిమిదోసారి.  అయితే, ఐదుసార్లు భారత్ పైచేయి సాధించింది.

టైటిల్ ఫైట్‌లో భార‌త జ‌ట్టుకు తిరుగులేని రికార్డు ఉంది. ఇప్ప‌టివ‌ర‌కూ 11సార్లు టైటిల్ పోరుకు అర్హత సాధించిన భారత్ ఏకంగా 7 ప‌ర్యాయాలు ట్రోఫీని అందుకుంది. మ‌రోవైపు 13 ఫైన‌ల్స్ ఆడిన లంక 6 సార్లు మాత్ర‌మే చాంపియ‌న్‌గా నిలిచింది.  ఇక‌, పాకిస్థాన్ విష‌యానికొస్తే ఐదు ప‌ర్యాయాలు ఫైన‌ల్లో ఆడినా రెండు సార్లు మాత్రమే విజేత‌గా నిలిచింది. బంగ్లాదేశ్ జ‌ట్టు మూడుసార్లు ఫైన‌ల్లో అడుగుపెట్టింది. కానీ, ఆ మూడుసార్లు ర‌న్న‌ర‌ప్‌గానే వెనుదిరిగింది. గ‌ణాంకాల ప‌రంగా చూస్తే ఆసియా క‌ప్‌లో భార‌త జ‌ట్టుదే పైచేయి. 

కానీ, సొంత‌గ‌డ్డ‌పై ద‌సున్ శ‌న‌క బృందాన్ని త‌క్కువ అంచ‌నా వేస్తే రోహిత్ సేన భారీ మూల్యం చెల్లించుకున్న‌ట్టే. ఎందుకంటే సెప్టెంబ‌ర్ 12న జ‌రిగిన‌ సూప‌ర్ 4 మ్యాచ్ అందుకే నిద‌ర్శ‌నం. ఆ గేమ్‌లో యువ స్పిన్న‌ర్, అండ‌ర్ -19 చాంపియ‌న్ దునిత్ వెల్ల‌లాగే దెబ్బ‌కు భార‌త టాపార్డ‌ర్ కుప్ప‌కూలింది. ఈ కుర్ర బౌల‌ర్ కీల‌క‌మైన 5 వికెట్లు తీసి కెరీర్‌లో అత్యుత్త‌మ గ‌ణాంకాలు న‌మోదు చేశాడు.

అయితే, కుల్దీప్ యాద‌వ్ 4 వికెట్లతో మ్యాచ్‌ను మ‌లుపు తిప్పాడు. దాంతో, భారత్ 41 ప‌రుగుల తేడాతో గెలుపొంది ఫైన‌ల్‌కు చేరింది. ఆ తర్వాత పాకిస్థాన్‌పై సంచ‌ల‌న విజ‌యంతో శ్రీ‌లంక టైటిల్ పోరుకు సిద్ధ‌మైంది. ఆదివారం కొలంబోలోని ప్రేమ‌దాస స్టేడియంలో భార‌త జట్టును ఢీ కొన‌నుంది. ఈ మ్యాచ్‌లో వెల్ల‌లాగే, కుల్దీప్ ఇరుజ‌ట్ల‌కు కీల‌కం కానున్నారు.