`ఇండియా’ టీవీ ఛానళ్లు, యాంకర్లు, షోల బహిష్కరణ

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిపై పోరాటాన్ని మరింత ముమ్మరం చేసిన ప్రతిపక్ష ఇండియా కూటమి తమకు వ్యతిరేకంగా ప్రచారం చేసే మీడియాపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగానే ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేసే టీవీ ఛానళ్లు, యాంకర్లు, టీవీ షోలపై బహిష్కరణ వేటు వేయాలని నిర్ణయం తీసుకున్నాయి. 
 
ఈ క్రమంలోనే ఇండియా కూటమిలోని పార్టీలకు చెందిన అధికార ప్రతినిధులు ఎవరూ కొన్ని మీడియా సంస్థల్లో డిబేట్లు, చర్చల్లో పాల్గొనకూడదని నిర్ణయి తీసుకున్నారు.  ఇండియా కూటమికి వ్యతిరేకంగా ప్రచారం చేసే మీడియా సంస్థలు, వ్యక్తులపై నిషేధం విధించేందుకు ఇండియా కూటమి సమన్వయ కమిటీకి చెందిన ఒక సబ్ కమిటీ చర్యలు చేపడుతుందని బుధవారం ఢిల్లీలోని శరద్ పవార్ నివాసంలో నిర్వహించిన భేటీ తర్వాత ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
 
దేశంలోని ఏ ఏ ఛానళ్లు, యాంకర్లు, షోలపై నిషేధం విధించాలనే జాబితాను గురువారం విడుదల చేశారు. అందులో ఆదిత్య త్యాగి (భారత్ ఎక్సప్రెస్), అమన్ చోప్రా (నెట్ వర్క్ 18), అమిష్ దేవ్ గన్ (న్యూస్ 18), అర్నబ్ గోస్వామి (రిపబ్లిక్ టీవీ), అశోక్ శ్రీవాత్సవ (డిడి), నావికా కుమార్ (టైమ్స్ నౌ), సుధీర్ చౌదరి (ఆజ్ తక్), గౌరవ్ సావంత్ (ఇండియా టుడే) తదితరుల పేర్లు ఉన్నాయి.
 
ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రకు కొన్ని మీడియా సంస్థలు తక్కువ కవరేజీ ఇచ్చినట్లు కాంగ్రెస్ విమర్శలు చేసింది. కొన్ని మీడియా ఛానళ్ల కవరేజీ లేకున్నా ప్రజలు, సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు విశేష స్పందన లభించిందని కాంగ్రెస్ వెల్లడించింది.

ఒక నెల రోజుల పాటు మీడియా సంస్థల్లోని టీవీ షోల్లో జరిగే డిబేట్లకు తమ అధికార ప్రతినిధులను పంపకూడదని నిర్ణయించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా ట్విటర్ వేదికగా వెల్లడించారు. మీడియా ఛానెల్‌లు, ఎడిటర్‌లు వారి కార్యక్రమాల్లో కాంగ్రెస్ ప్రతినిధులను ఉంచవద్దని కోరుతున్నట్లు ట్వీట్ చేశారు. అయితే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ మీడియాపై ఆంక్షలు విధించింది. 2019 లో కూడా నెల రోజులపాటు టీవీ డిబేట్లకు తమ ప్రతినిధులు వెళ్లకుండా నిషేధం విధించింది.