తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం.. పెరిగిన పారిశ్రామికాభివృద్ధి

ఆగస్టులో దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం ఊరటనిచ్చింది. గత నెలలో వినియోగ ధరల సూచీ(సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 6.83 శాతానికి తగ్గింది. అంతకుముందు జులైలో ఇది 7.44 శాతంతో గరిష్ఠ స్థాయిలో ఉండగా, ఈసారి కాస్త తగ్గుముఖం పట్టింది.  మరోవంక, దేశంలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు జూలై నెలలో ఐదు నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. 

మంగళవారం కేంద్ర గణాంకాల శాఖ ఈ డేటాను విడుదల చేసింది. అయితే రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటికీ ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) పరిమితికి పైనే ఉంది. ఇంకా కొంత మేరకు ద్రవ్యోల్బణం తగ్గాల్సి ఉంది. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 7 శాతం దిగువకు చేరుకుంటుందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు.  అయితే వారి అంచనాలకు తగ్గట్టుగానే ద్రవ్యోల్బణం దిగొచ్చింది.

ఆసక్తికరమైన విషయమేమిటంటే పట్టణాల్లో ద్రవ్యోల్బణం 6.59 శాతంతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో 7.02 శాతంతో కొంత అధికంగా ఉంది. కూరగాయల ధరల్లో క్షీణత రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుదలలో కీలకంగా ఉంది. అయితే పప్పు ధాన్యాలు, పాలు, పండ్లు వంటి ఆహార పదార్థాల ధరలు ఆగస్టులలో స్వల్పంగా పెరిగాయి. ఆహార ద్రవ్యోల్బణం ఆగస్టులో 9.94 శాతానికి తగ్గింది. ఇది జులైలో 11.51 శాతంగా ఉంది.

5 నెలల గరిష్టంకు పారిశ్రామికాభివృద్ధి

మరోవంక, దేశంలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు జూలై నెలలో ఐదు నెలల గరిష్ఠ స్థాయి 5.7 శాతంగా నమోదైంది. ఇది ఐదు నెలల గరిష్ఠ స్థాయి. తయారీ, మైనింగ్‌, పవర్‌ రంగాలు మంచి పనితీరు కనబరచడం ఇందుకు దోహదపడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదైన 6 శాతం వృద్ధి రేటు తర్వాత నమోదైన గరిష్ఠ స్థాయి ఇదే. 

గత ఏడాది జూలైలో ఐఐపీ 2.2 శాతం ఉండగా ఈ ఏడాది జూన్‌లో 3.8 శాతంగా ఉంది. ఇదిలా ఉండగా ఏప్రిల్‌-జూలై నెలల మధ్య కాలంలో ఐఐపీ 4.8 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో ఐఐపీ 10 శాతం వద్ద ఉంది. ఎన్‌ఎ్‌సఓ గణాంకాల ప్రకారం జూలైలో తయారీ రంగం 4.6 శాతం, విద్యుదుత్పత్తి రంగం 8 శాతం, మైనింగ్‌ రంగం 10.7 శాతం వృద్ధిని నమోదు చేశాయి. యంత్రపరికరాల విభాగం కూడా 4.6 శాతం వృద్ధిని సాధించింది. ఇందుకు భిన్నంగా కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌ రంగం వృద్ధి మాత్రం 2.7 శాతానికి దిగజారింది.