అవినీతి కేసుల్లో సిబిఐ ముందస్తు అనుమతి తప్పనిసరికాదు

సీనియర్‌ ప్రభుత్వ అధికారులపై వచ్చిన అవినీతి కేసులు దర్యాప్తు చేపట్టడానికి సిబిఐ ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరన్న నిబంధన చెల్లదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. 2014లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునే రాజ్యాంగ ధర్మాసనం సోమవారం పునరుద్ఘాటిస్తూ, ఇది తీర్పు ఇచ్చినతేదీ నుంచే కాదు, సిబిఐకి మార్గ నిర్దేశం చేసే ఢిల్లీ ప్రత్యేక పోలీసు వ్యవస్థ (డిఎస్‌పిఇ) చట్టానికి సెక్షన్‌ 6ఎ ని జోడించిన తేదీ నాటి నుంచే, అంటే 2003 సెప్టెంబరు 11 నుంచే అమల్లోకి వచ్చినట్లుగా పరిగణించాలని జస్టిస్‌ సంజయ్ కిషన్‌ కౌల్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం పేర్కొంది. 

సెక్షన్‌6ఎ ఏం చెబుతోంది? ప్రభుత్వ ఉన్నతాధికారులపై అవినీతి వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరపాలంటే ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని అంటోంది. 2014లో డాక్టర్‌ సుబ్రమణ్యం స్వామి కేసులో సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ సెక్షన్‌-6ఎ రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది.  దీంతో జాయింట్‌ సెక్రటరీ ఆపై ర్యాంక్‌ అధికారులను సిబిఐ ప్రాథమికంగా విచారణ జరపాలంటే సిబిఐకి ముందస్తు అనుమతి అవసరం లేదు.

అయితే, కోర్టు తీర్పు ఇచ్చిన తేదీ నుంచే అమల్లోకి వస్తుందని, అంతకుముందు నమోదయిన అవినీతి కేసుల్లో ఇరుక్కున్న సీనియర్‌ బ్యూరోక్రాట్లకు సెక్షన్‌-6ఎ కింద రక్షణ ఉంటుందని కొందరు వాదించారు.  ఈ వాదనలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం, ఆ సెక్షన్‌ను ఎప్పుడు చట్టంలో చేర్చారో ఆనాటి నుంచే దాని చెల్లుబాటు రద్దయిందని రద్దు చేస్తున్నట్లుగా వస్తుందని పునరుద్ఘాటించింది.

సెక్షన్‌-6ఎ అనేది రాజ్యాంగంలోని సమానత్వ హక్కుకు హామీ ఇస్తున్న ఆర్టికల్‌14కి విరుద్ధమని రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. అవినీతి దేశానికి శత్రువు. అవినీతికి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగి (పబ్లిక్‌ సర్వెంట్‌) పెద్ద స్థాయిలో ఉన్నాసరే, వారిని అరెస్టు చేయడానికి, శిక్షించడానికి అవినీతి నిరోధక చట్టం-1988ను కచ్చితంగా అనుసరించాలి. సదరు ప్రభుత్వ ఉద్యోగి హోదా లేదా స్థితి కారణంగా ఆ వ్యక్తికి ఎటువంటి మినహాయింపు ఇవ్వడం సరికాదు. 

వారు అందరిలాగే నేరం చేసినందున అవినీతి అధికారులను రెండు కేటగిరీలుగా విభజించరాదు. అలా చేయడం 1988 అవినీతి నిరోధకచట్ట లక్ష్యాలకే విరుద్ధం. వీరి విషయంలోనూ సాధారణ విచారణ, దర్యాప్తు క్రమాన్ని అనుసరించాలని 2014 తీర్పులో సుప్రీం పేర్కొంది. సెక్షన్‌-6ఎ అవినీతి పరులైన సీనియర్‌ బ్యూరోక్రాట్లను గుర్తించేందుకు ఆటంకం కల్పిస్తోంది. ఇది వారికి ఒక రక్షణ కవచంగా ఉంది అని సుప్రీం ధర్మాసనం ముక్తాయింపు ఇచ్చింది.