సైబర్ నేరాల్లో ఎక్కువగా మోసపోతున్న విద్యావంతులు

నానాటికి పెరుగుతున్న సైబర్ నేరాల కారణంగా విషయం పరిజ్ఞానం లేని సామాన్యులు, గ్రామీణులు కాకుండా విద్యావంతులే ఎక్కువగా నష్టపోతున్నారు. దేశంలో జరుగుతున్న సైబర్ నేరాల్లో ఎక్కువగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అంటూ పెట్టుబడులను ఆకర్షిస్తూ జరుగుతున్న మోసాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఆ తర్వాత స్థానాలలో నకిలీ రుణాలు, నకిలీ వినియోగదారుల సేవలు ఉంటున్నాయి.
 
2019లో ఈ తరహా 2,013 కేసులు మాత్రమే నమోదవ్వగా, ప్రస్తుతం ఏటా వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఒక్క 2022-23లో సుమారు 50,374 ఫిర్యాదులు నమోదయ్యాయి. సైబర్‌ నేరాలు మొదలైన కొత్తలో మీకు గిఫ్ట్‌ వచ్చిందని, బ్యాంకు అకౌంట్‌ నుంచి డబ్బులు కట్‌ అయ్యాయని, విదేశీ సంబంధమని, బ్యాంకు మేనేజర్‌ పేరిట, లక్షల్లో లాటరీ తగిలిందనే తరహా మోసాలు విపరీతంగా జరిగేవి. 
 
ఆ నేరాల్లో ఎక్కువగా సాంకేతికత తెలియనవారు మోసపోయేవారు. అయితే ఇటువంటి  సైబర్‌ నేరాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తుండడంతో ఇప్పుడు  నేరగాళ్లు కొత్త ఎత్తుగడలు వేస్తూ వస్తున్నారు. చదువుకున్నవారిని, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లను లక్ష్యంగా వలవేస్తున్నారు.
నెలకు వేలల్లో, లక్షల్లో సంపాదించే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్‌ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లను టార్గెట్‌ చేస్తున్న సైబర్‌ దొంగలు సులువుగా బురిడీ కొట్టించేందుకు బిజినెస్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్స్‌కు తెర తీశారు. ఎవరైనా గూగుల్‌ వంటి సెర్చ్‌ ఇంజిన్లలో తమకు కావల్సిన సేవల కోసం వెతికితే వెంటనే నకిలీ కస్టమర్‌ కేర్‌ సర్వీస్‌ నుంచి కాల్స్‌ చేసి మోసం చేస్తున్నారు. 

థర్డ్‌ పార్టీ యాప్స్‌ ద్వారా క్రెడిట్‌/డెబిట్‌ కార్డుల సమాచారం తెలుసుకొని, వాటిని క్లోనింగ్‌ చేస్తూ మోసగిస్తున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక మధ్య తరగతి ప్రజల ఆర్థిక అవసరాలను లక్ష్యంగా చేసుకొని, తక్కువ వడ్డీకి ఎక్కువ లోన్‌ ఇప్పిస్తామని మోసగిస్తున్న ఘటనలూ ఉన్నాయి. ఖాళీ సమయాల్లో మరేదైనా పని చేసుకునేందుకు ‘పార్ట్‌టైమ్‌ జాబ్‌’ కోసం వెతికినా మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ సోషల్‌ మీడియా ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేయడం, అత్యవసరంగా డబ్బులు కావాలని చాట్‌ చేయడం, త్వరలోనే ఇస్తానని నమ్మబలకడం ఈ మధ్య సర్వసాధారణ సైబర్‌ నేరాలుగా మారాయి.