ప్రపంచ దృష్టిని ఆకట్టుకొంటున్న భారత మండపం

జీ20 శిఖరాగ్ర సదస్సుకు వేదికగా నిలిచిన భారత్‌ మండపం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ శిఖరాగ్ర సదస్సుకు దీనినే ఎందుకు ఎంపిక చేశారు?  ఇక్కడి ప్రత్యేకతలు ఏమిటనేది చర్చనీయాంశంగా మారాయి. భారత్‌ మండపాన్ని ప్రధాని నరేంద్ర మోదీ  జులై 25న ప్రారంభించారు. దేశంలో నిర్వహించే అతి ముఖ్యమైన సమావేశాలకు అత్యాధునిక మౌలిక సదుపాయాలు కలిగిన ఒక ప్రత్యేక సమావేశ మందిరం ఉండాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలో భాగంగానే ఈ భారత్ మండపాన్ని తీర్చిదిద్దారు.
దేశీయ సంస్కఅతి ఉట్టిపడేలా దీనిని డిజైన్‌ చేశారు.  ఈ కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.2,700 కోట్లు వెచ్చించింది. ప్రగతి మైదాన్‌లోని 123 ఎకరాల్లో ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ కమ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌గా దీనిని నిర్మించారు. భారత్‌లో ఇది అతిపెద్ద ఎంఐసీఈ (మీటింగ్స్‌, ఇన్సెంటీవ్స్‌,కాన్ఫరెన్సెస్‌, ఎగ్జిబిషన్స్‌) కేంద్రం. 
 
ఏకకాలంలో ఇక్కడ 5,500 వాహనాలను పార్కింగ్‌ చేసుకోవచ్చు. శంఖు ఆకారంలో నిర్మించారు. దీని గోడలపై భారత చరిత్ర, సంప్రదాయానికి సంబంధించిన వివిధ అంశాలను చిత్రీకరించారు. వీటిల్లో ఆదివాసీ చిత్రకారులు గీసిన బమ్మలు ఉన్నాయి. భారత్‌ మండపం మొత్తం 5జీ వైఫై నెట్‌వర్క్‌ అందుబాటులో ఉంటుంది. ఇది 10 జీబీ వేగంతో పనిచేస్తుంది. 
 
ఏకకాలంలో పలు సమావేశాలు ఏర్పాటు చేసేలా చాలా మీటింగ్‌ హాల్స్‌, లాంజ్‌లు, ఆడిటోరియంలు ఉన్నాయి. దీనిలోని యాంఫీ థియేటర్‌లో 3,000 మంది కూర్చోవచ్చు. భారత్‌ మండపంలో మెజెస్టిక్‌ మల్టీపర్పస్‌ హాల్‌, ప్లీనరీ హాల్‌ ఉన్నాయి. వీటిలో కలిపి 7,000 మంది కూర్చోవచ్చు.  భారత్‌ మండపంలోని దుబాసీల రూములో 16 భాషలను సపోర్ట్‌ చేసే అత్యాధునిక టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్‌ ఏవీ సిస్టమ్‌, భారీ వీడియో వాల్స్‌ ఉన్నాయి. ఇక్కడ లైట్లు ఆక్యూపెన్సీ సెన్సర్ల ఆధారంగా పనిచేస్తాయి. సమీకృత నిఘా కేంద్రం కూడా ఇందులో ఉంది.
 
ఈ భారత్ మండపం గోడలు, భవనం ముందు భాగంలో భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రూపొందించారు. సూర్యశక్తి, జీరో టు ఇస్రో, పంచ మహాభూతం వంటి థీమ్‌లతో భారత్ మండపంలోని గోడలను మరింత అందంగా తీర్చిదిద్దారు. ఇక ఈ జీ20 సదస్సు కోసం తమిళనాడులో ప్రత్యేకంగా తయారు చేయించిన నటరాజ విగ్రహాన్ని భారత మండపం వెలుపల ప్రతిష్టించారు.