స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో రూ 370 కోట్లు స్వాహా

స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో రూ 370 కోట్లు స్వాహా
స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటులో కుంభకోణం జరిగిందని,. ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన రూ. 371 కోట్లు డిజైన్ టెక్ సహా ఇతర షెల్ కంపెనీలకు వెళ్లినట్టు తేలిందని శనివారం సీఐడీ అదనపు డీజీ సంజయ్‌ వెల్లడించారు. సీమెన్స్ తరపున డిజైన్ టెక్ అనే సంస్థ ద్వారా లావాదేవీలు జరిగాయని, ఒప్పందం జరిగే సమయానికి డిజైన్ టెక్ అనే సంస్థ లేదని  తెలిపారు.
 
కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రబాబును ఈరోజు ఉదయం 6 గంటలకు నంద్యాలలో ఆర్కే ఫంక్షన్‌ హాల్‌ నుంచి సీఐడీ బృందం అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో రూ. 550 కోట్ల స్కామ్‌ జరిగిందని , అందులో ప్రభుత్వానికి రూ.371 కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. 
 
నకిలీ ఇన్‌వాయిస్‌ల ద్వారా షెల్‌ కంపెనీలకు నిధులు మళ్లించారని,  చంద్రబాబుకు అన్ని లావాదేవీల గురించి తెలుసునని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి కీలక పత్రాలను మాయం చేశారని చెబుతూ ఈ స్కామ్‌లో లబ్ధిదారుడు కూడా చంద్రబాబేనని స్పష్టం చేశారు. ఈ కేసు దర్యాప్తులో చంద్రబాబు నాయుడే ప్రధాన నిందుతుడని తేలిందని చెప్పారు. 
 
చంద్రబాబును కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఈడీ, జీఎస్టీలు కూడా ఇప్పటికే ఈ కేసును విచారించాయని తెలిపారు. ఈ కేసులో నారా లోకేశ్ ను కూడా ప్రశ్నించాల్సి ఉందని చెప్పారు. నిధులు కాజేసేందుకే స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారని ఆరోపించారు. 
 
కేబినెట్ ఆమోదం లేకుండానే కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారని చెప్పారు. గంటా సుబ్బారావును కార్పొరేషన్ ఎండీ, సీఈవోగా నియమించారని తెలిపారు. ఆయనకు నాలుగు పదవులు కట్టబెట్టారని పేర్కొంటూ న్యాయ పరంగా అన్ని చర్యలు తీసుకునే చంద్రబాబును అరెస్ట్ చేశామని తెలిపారు.  అన్ని వివరాలు బయటకు రావాలంటే చంద్రబాబును అరెస్ట్ చేయడం తప్పదని స్పష్టం చేశారు. ఈ కేసులోని ఇతర నిందితులు దుబాయ్, యూఎస్ లలో ఉన్నారని చెబుతూ అక్కడి నుంచి తీసుకురావడానికి ఆయా దేశాలకు అధికారులు వెళ్తారని చెప్పారు.
 
“ఈ కేసులో రాజేశ్, నారా లోకేష్ పాత్రలు ఎంత ఉన్నాయన్నది తేలుస్తాం. ఏపీ ఫైబర్ నెట్ తో పాటు , ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమాల కేసులోనూ నారా లోకేష్ పాత్ర పై నా విచారణ చేస్తాం. చంద్రబాబు ను ఇవాళ విజయవాడ ఎసిబి కోర్టులో హాజరుపరుస్తాం. ఆయన్ను విజయవాడ కు తీసుకు రావడానికి హెలికాప్టర్ సిద్ధం చేశాం. అయితే ఆయన వద్దనీ అన్నారు. అయన వయసు దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం” అని చెప్పారు.