ఉద‌య‌నిధి వ్యాఖ్య‌లను తీవ్రంగా ఖండించిన క‌ర‌ణ్ సింగ్‌

ఉద‌య‌నిధి వ్యాఖ్య‌లను తీవ్రంగా ఖండించిన క‌ర‌ణ్ సింగ్‌
స‌నాత‌న ధ‌ర్మాన్ని నిర్మూలించాల‌ని త‌మిళ‌నాడు మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌ను సీనియ‌ర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి డాక్ట‌ర్ క‌ర‌ణ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఉద‌య‌నిధి చేసిన వ్యాఖ్య‌లు చాలా దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని అంటూ ఆ వ్యాఖ్య‌ల‌ను ఆమోదించ‌లేమని స్పష్టం చేశారు.  ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది ప్ర‌జ‌లు.. కొద్దో గొప్పో స‌నాత‌న ధ‌ర్మాన్ని పాటిస్తుంటార‌ని, ఇక స‌నాత‌న ధ‌ర్మానికి చెందిన ఎన్నో ప్ర‌ఖ్యాత ఆల‌యాలు త‌మిళ‌నాడు రాష్ట్రంలోనే ఉన్నాయ‌ని క‌ర‌ణ్ సింగ్ తెలిపారు.
ఉద‌య‌నిధి వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ ఆయ‌న ఓ లేఖ‌ను విడుదల చేశారు.  తంజావూరు, శ్రీరంగం, తిరువ‌న్న‌మ‌లై, చిదంబ‌రం, మ‌ధురై, సుచింద్ర‌మ్, రామేశ్వ‌రం లాంటి ఎన్నో పెద్ద పెద్ద ఆల‌యాలు త‌మిళ‌నాడులో ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఓ రాజ‌కీయ వేత్త ఇలాంటి షాకింగ్ వ్యాఖ్య‌లు చేయ‌డం అర్థ‌ర‌హిత‌మ‌ని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. త‌మిళ సంస్కృతి ప‌ట్ల తన‌కు ఎన‌లేని గౌర‌వం ఉంద‌ని చెబుతూ ఉద‌య‌నిధి స్టాలిన్ ఇచ్చిన ప్రకటనను వ్య‌క్తిగ‌తంగా తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు క‌ర‌ణ్ సింగ్ తెలిపారు.
 
డా. లక్ష్మణ్ ఆగ్రహం

తమిళనాడు మంత్రి ఉదయనిధి సనాతన ధర్మంపై విద్వేష పూరితంగా, అవమానకరంగా మాట్లాడటాన్ని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ వంటిదని.. ఆ ధర్మాన్ని నిర్మూలించాలని, నాశనం చేయాలని వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులతో పోల్చి యావత్ హిందువులను అవమానపర్చారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ లాంటి కొన్ని పార్టీలు కూడా ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తూ 100 కోట్ల మంది హిందువులను అవమానపర్చుతున్నాయని మండిపడ్డారు.  కాంగ్రెస్ వ్యవహరిస్తున్న వైఖరి పట్ల సనాతన ధర్మాన్ని విశ్వసించే హిందువులు, ప్రజలు ఆలోచించుకోవాలని ఆయన కోరారు. కుహనా లౌకికవాదం ముసుగులో కాంగ్రెస్ చేసే రాజకీయాలకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు.
తమిళనాడు ప్రభుత్వ అధికారిక చిహ్నం(ఎంబ్లమ్)లోనే ఆలయం ముద్రణ ఉంటుందని గుర్తు చేస్తూ మీకు దమ్ముంటే ఆ చిహ్నాన్ని తీసేయండి అంటూ స్టాలిన్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అప్పుడు సనాతన ధర్మాన్ని విశ్వసించే వారంతా మీకు సరైన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సనాతన ధర్మంపై విషం కక్కిన ఉదయనిధి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే డీఎంకే పార్టీకి, ఆ పార్టీతో అంటకాగే కాంగ్రెస్ వంటి పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.