రోడ్డు ప్రమాదంలో బీజేపీ నేత ఓరుగంటి రాములు మృతి

నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీజేపీ సీనియర్‌ నాయకుడు ఓరుగంటి రాములు (79) మృతి చెందారు. శనివారం మధ్యాహ్నం సమయంలో తన కుమారుడి కారులో కలెక్టరేట్‌ సమీపంలోకి వచ్చి మెడికల్‌ షాపునకు నడుచుకుంటూ వెళ్తుండగా వేగంగా వచ్చిన టాటా ఏస్‌ వాహనం ఆయన్ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఓరుగంటి రాములు తలకు బలమైన గాయాలయ్యాయి. హుటాహుటిన ఆయన్ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాగా, ఓరుగంటి రాములు మరణవార్త తెలిసి నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆస్పత్రికి వెళ్లి రాములు పార్థివదేహానికి నివాళులర్పించారు.

ఓరుగంటి రాములు 1983లో నల్లగొండ నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పార్టీ అధ్యక్షునిగా పనిచేశారు. ఎమర్జెన్సీ సమయంలో మీసా చట్టం కింద జైలుకు వెళ్లారు. ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఘ్‌లో పలు కీలక పదవులు చేపట్టారు.

ఓరుగంటి రాములు మృతి చెందడం దిగ్భ్రాంతికి గురిచేసిందని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి తెలిపారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, జిల్లా అధ్యక్షుడిగా, పార్టీ సీనియర్ నాయకుడిగా రాములు ఎంతో నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పోరాడి జైలుకు వెళ్లిన వ్యక్తి అని చెప్పారు. 

జాతీయ భావాలు, విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తూ కార్యకర్తలను తయారు చేసిన వ్యక్తి అని గుర్తుచేశారు. రాములు ఆకస్మిక మరణం పార్టీకి, జిల్లా ప్రజలకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.