అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల దరఖాస్తులకు బీజేపీ పిలుపు

 
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు ప్రారంభిస్తున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​ అభ్యర్థుల టికెట్లను దాదాపుగా ఖరారు చేసింది. 115 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.
 
ఇక ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్​ అభ్యర్థుల నుంచి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ఇటీవలే పూర్తి చేసింది. వెయ్యికిపై దరఖాస్తులు వచ్చాయి దరఖాస్తుల వడబోతను ప్రారంభించింది. తాజాగా, రాష్ట్రంలో మరో ప్రధాన పార్టీ అయిన బీజేపీ ఎమ్మెల్యే టికెట్‌​కు ఆశావహుల నుంచి దరఖాస్తు స్వీకరణకు ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ ​రెడ్డి నేతృత్యంలోని కమిటీ దరఖాస్తులు తీసుకునేందుకు నిర్ణయం తీసుకుంది.
 
సెప్టెంబర్ 4 ఉదయం 10 గంటల నుండి పార్టీ రాష్త్ర కార్యాలయంలో అభ్యర్థుల వివరాలతో కూడిన దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది. ఈ నెల 10 తేదీ వరకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించారు.

ఈ ప్రక్రియ సెప్టెంబర్​  4 నుంచి 10వ తేదీ వరకు కొనసాగనుంది. అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. ఒక్కో అసెంబ్లీ స్థానం నుంచి ఎక్కువ సంఖ్యలో ఆశావాహులు ఉండటంతో బీజేపీ కూడా దరఖాస్తు ప్రక్రియకు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. దీంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టింది. కాంగ్రెస్, బీజేపీలు కూడా ప్రజల్లోకి వెళుతూ తమ పార్టీని గెలిపించాలంటూ కోరుతున్నాయి. ఈ మూడు పార్టీలు కూడా వచ్చే ఎన్నికల్లో తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అధికారం చేపట్టేది తామేనంటూ మూడు పార్టీల నేతలు ప్రకటిస్తున్నారు.