కేంద్ర నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో తాత్సారం

కేంద్ర నిధులతో వివిధ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో తాత్సారం జరుగుతున్నదని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ విచారం వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ(దిశా) సమావేశంకు అధ్యక్షత వహిస్తూ కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై సమీక్ష జరిపారు.
 
ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయించేందుకు అధికారులు చొరవ చూపాలని, పనులు నాణ్యతతో జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని ఆయన సూచించారు. నిర్దిష్ట గడువులోపు పనులను పూర్తి చేయడంలో విఫలమవుతున్న కాంట్రాక్టర్లపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
 
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగుపరచి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా చొరవ చూపాలని సంబంధిత అధికారులకు హితవు పలికారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం మంజూరయ్యిందా అని ఎం.పీ ఆరా తీశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన చోట లబ్దిదారులను ఎంపిక చేసి త్వరితగతిన ఇళ్లను కేటాయించాలని ఎం.పీ సూచించగా, ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.
 
కాగా, ప్రభుత్వ బడులలో విద్యార్థులకు మధ్యాన్న భోజనంలో గుడ్డు అందించడం లేదని సభ్యులు సమావేశంలో ఫిర్యాదు చేయగా, విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులు, అమలవుతున్న కార్యక్రమాలకు సంబంధించి శిలాఫలకాలపై ఆ వివరాలను పొందుపర్చడం లేదని పలువురు సభ్యులు సమావేశంలో ఆక్షేపణ తెలిపారు. 
 
దీనిపై ఎం.పీ స్పందిస్తూ, తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ నిధుల వివరాలను పొందుపర్చాలని అధికారులకు సూచించారు. 2016 నుండి ఇప్పటివరకు జిల్లాలో ముద్ర లోన్స్ కింద 1,58,694 మందికి 2264.88 కోట్ల రూపాయల రుణాలు అందించడం జరిగిందని లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ తెలుపగా, ముద్ర రుణాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఎం.పీ సూచించారు.