ఆర్టికల్‌ 35ఏ వల్ల కశ్మీరీలకు నష్టమే!

జమ్మూకశ్మీరు స్వయంప్రతిపత్తి కోసం కేంద్ర ప్రభుత్వం 1954లో రాజ్యాంగంలో చేర్చిన 35ఎ ఆర్టికల్‌ వల్ల ఆ రాష్ట్ర ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ అభిప్రాయపడ్డారు. ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ సందర్భంగా సోమవారం ఆయనీ వ్యాఖ్యాలు చేశారు. 

35ఎ కారణంగా కశ్మీరు ప్రజలు 3 ప్రాథమిక హక్కులను కోల్పోయారని తెలిపారు. ఆర్టికల్‌ 16(1) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగాన్ని కోరే హక్కును కోల్పోయారని చెప్పారు. ఆర్టికల్‌ 19(1)(1) కింద స్థిరాస్థిని కొనుగోలు చేసే అవకాశాన్ని కోల్పోయారని తెలిపారు. 19(1)(ఎ) కింద అక్కడ స్థిరపడే అవకాశాన్ని కోల్పోయారని చెప్పారు. 

35ఎ రద్దు తర్వాత కశ్మీరు ప్రజలు మిగతా భారతదేశంతో సమానమయ్యారని, కశ్మీర్‌లో పెట్టుబడులు పెరిగాయని కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చెప్పారు.

కాగా, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 రద్దును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన వారిలో ఒకరైన జమ్మూ కశ్మీరు లెక్చరర్‌ జహూర్‌ అహ్మద్‌ భట్‌ను కోర్టులో వాదనలు వినిపించిన మర్నాడే ప్రభుత్వం సస్పెండ్‌ చేయడాన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.  జమ్మూ కశ్మీరు లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌తో మాట్లాడి సస్పెన్షన్‌కు కారణమేంటో కనుక్కోవాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం తరఫున విచారణకు హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ఆదేశించింది.

మథురలో స్థల వివాదాన్ని తేల్చాల్సింది సివిల్‌ కోర్టే

మరోవంక, మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వెనుక ఉన్న స్థలం హక్కులపై తాము ఎలాంటి తీర్పు ఇవ్వలేమని, స్థానిక సివిల్‌ కోర్టునే ఆశ్రయించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయమై తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వడానికి కూడా నిరాకరించింది. ఆ స్థలం తమదేనని వాదించిన రైల్వే శాఖ ఆక్రమణల పేరుతో అక్కడి నయీ బస్తీలో ఉన్న 135 ఇళ్లను తొలగించింది.

దీనిపై యాకూబ్‌ షా అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించగా పదిరోజుల పాటు యథాతథ స్థితి కొనసాగేలా ఈ నెల 16న ఆదేశాలు ఇచ్చింది.  యథాతథ స్థితి ఉత్తర్వులను పొడిగించాలని కోరుతూ మళ్లీ దరఖాస్తు రాగా పరిశీలించిన ధర్మాసనం దాన్ని తిరస్కరించింది. ఆ స్థలం హక్కులపై రైల్వే శాఖ, స్థానికుల మధ్య వివాదం ఉండడంతో దాన్ని సివిల్‌ కోర్టులోనే తేల్చుకోవాల్సి ఉందని తెలిపింది.