ఏనుగుల కోసం ఏపీలో రెండు కారిడార్లు

ఏనుగుల కోసం ఆంధ్ర ప్రదేశ్ లో రెండు కారిడార్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో ఒకటి అంతరాష్ట్ర కారిడార్‌ కాగా, మరొకటి రాష్ట్రంలోనే అంతర్‌జిల్లా కారిడార్‌. ఇవి రెండు కాకుండా ఆంధ్రప్రదేశ్‌- ఒడిషా సరిహద్దుల్లో కూడా ఏనుగుల కదలికలను అధికారికంగా గుర్తించారు.  రాష్ట్రంలో వన్య మృగాల సంచారం ఇప్పటికే ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

పులులు, చిరుత పులులు, ఏనుగులు ఎలుగుబంట్లు ఇటీవల కాలంలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లోకి జనావాసాల్లోకి వస్తున్న సంఘటనలు తెలిసిందే. తిరుమలలో ఇటీవలే ఒక చిన్నారిని చిరుత కబళించింది. కొన్ని ప్రాంతాల్లో పశువులు వీటి బారిన పడ్డాయి.  మరికొన్ని చోట్ల పండ్లతోటలు, పంటపొలాలు ధ్వంసమైనాయి. వీటిని నివారించి, ప్రజల ప్రాణాల రక్షణకు తీసుకున్న చర్యలు దాదాపు శూన్యం. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కారిడార్లలో 60 రెవిన్యూ గ్రామాల్లో ప్రజానీకం నివసిస్తున్నారు. వీరిలో అధిక భాగం వ్యవసాయం, పండ్లతోటలపైనే ఆధారపడి ఉన్నారు. 

కారిడార్‌ల ప్రకటనతో ఏనుగుల రక్షణకు ప్రాధాన్యత లభించనుంది. ఈ మార్గంలో జాతీయ రహదారులతో పాటు, రైలు మార్గాలు కూడా ఉన్నాయి. స్థానిక ప్రజలతో పాటు, ఈ మార్గాలో ప్రయాణం చేసే ప్రయాణీకుల భద్రతకు తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది.  ఆంధ్రా, ఒడిషా సరిహద్దు ప్రాంతంలో మరికొంత కాలంపాటు నిఘా ఉంచాలని సూచించడంతో భవిష్యత్‌లో ఇక్కడ కూడా మరో కారిడార్‌ను ప్రకటించే అవకాశం ఉంది. 

కేంద్ర ప్రభుత్వ అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ తాజాగా ప్రచురించిన ‘భారతదేశంలో ఎలిఫెంట్‌ కారిడార్స్‌-2023’ నివేదికలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. 2010 తర్వాత ఈ తరహా నివేదికను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఇదే మొదటిసారి. దేశం మొత్తం మీద 150 కారిడార్లను ఈ నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన కారిడార్లకు నివేదికలో చోటు లభించడంతో ఏనుగుల సంరక్షణ మరింత సులభమవుతుందన్న అభిప్రాయాన్ని అటవీశాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో మొదటి ఏనుగుల కారిడార్‌గా కేంద్రం గుర్తించిన ప్రాంతం మూడు రాష్ట్రాల మధ్య విస్తరించి ఉంది.  కర్నాటకలోని కోలార్‌ ఫారెస్ట్‌ డివిజన్‌ కామసముద్రం అటవీ ప్రాంతం నుండి ప్రారంభమయ్యే ఈ కారిడార్‌ తమిళనాడులోని హోసూరు వెప్పనపల్లి రిజర్వు ఫారెస్ట్‌ మీదుగా ఆంధ్రపదేశ్‌ వరకు వ్యాపించిఉంది. రాష్ట్రంలో కుప్పం రేంజి రిజర్వు ఫారెస్ట్‌లోని కౌరడిన్య అభయారణ్యం మల్లనూరు గ్రామం వరు ఈ కారిడార్‌ ఉంది. 

మొత్తం 28 కిలోమీటర్ల పొడవు, 3.5 నుంచి ఐదు కిలోమీటర్ల వెడల్పులో ఈ కారిడార్‌ విస్తరించినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ కారిడార్‌లో 15 నుండి 20 ఏనుగులు తిరుగుతున్నట్లు గుర్తించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి ఏనుగులు రావడానికి అవకాశం ఉన్న ఏకైక మార్గంగా ఈ కారిడార్‌ను పేర్కొన్నారు.

ఈ కారిడార్‌లో అధికభాగం మగ ఏనుగులే తిరుగుతున్నాయని నివేదికలో పేర్కొన్నారు. ఈ కారిడార్‌ను పరిరక్షించుకోకపోతే రాష్ట్రంలో ఉన్న ఏనుగులు చిన్న గుంపుగా ఒంటరి పాటుకు గురవుతాయని, ఉనికి కూడా ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉందని నివేదికలో హెచ్చరించారు. ఈ కారిడార్‌ను అభివృద్ధి చేయడంలో ఉన్న ఇబ్బందులను కూడా నివేదికలో పేర్కొన్నారు.

కారిడార్‌గా గుర్తించిన ప్రాంతంలో 40 రెవిన్యూ గ్రామాలున్నాయి. కృష్ణగిరి- పలమనేరు నేషనల్‌ హైవే (ఎన్‌హెచ్‌ 42) కూడా ఈ మార్గం గుండానే వెడుతుంది. దాదాపు 25 కి.మీల బెంగళూరు- చెన్నై రెండు లైన్ల రైల్వే మార్గం కూడా ఈ కారిడార్‌ మీదగానే వెడుతుంది. జిల్లా స్థాయికి చెందిన కొన్ని ప్రధాన రోడ్లు కూడా ఈ కారిడార్‌లో ఉన్నాయి.

70 కి.మీ పొడవు, 11 కి.మీ వెడల్పులో విస్తరించి ఉన్న మరో కారిడార్‌ను ‘రాయల ఎలిఫెంట్‌ రిజర్వు కారిడార్‌’గా కేంద్రం గుర్తించింది. చిత్తూరు జిల్లాలోని కౌండిన్య వైల్డ్‌లైఫ్‌ సాంచ్యురి నుండి తిరుపతి జిల్లాలోని శ్రీవెరకటేశ్వర నేషనల్‌ పార్క్‌ వరకుఇది విస్తరించి ఉంది. ఈ కారిడార్‌ పురగనూర్‌, చిత్తూరు పశ్చిమ, బాకరాపేట్‌ అటవీ రేరజ్‌ పరిధిలో ఉంది. 

ఈ కారిడార్‌లో 50 నుండి 60 ఏనుగులు తిరుగుతున్నట్లు గుర్తించారు. వెంకటేశ్వర నేషనల్‌ పార్కు నుండి కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వరకు ఏనుగులు తిరగడానికి ఇదొక్క మార్గమే ఉందని, ఈ మార్గాన్ని చిరుతలు, ఎలుగుబంట్లు, దుప్పులు వంటి ఇతర వన్యప్రాణులు కూడా రాకపోకలకు ఉపయోగించుకుంటున్నాయని నివేదికలో పేర్కొన్నారు.

ఈ కారిడార్‌ పరిధిలో బెంగళూరు – తిరుపతి, కడప- చిత్తూరు హైవేలు ఉన్నాయి. నూతనంగా ప్రతిపాదించిన బెంగళూరు- చెన్నై ఎక్స్‌ప్రెస్‌ హై వే కూడా ఈ మార్గం గుండానే వెడుతుంది. దాదాపు 50 కి.మీ మేర హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్‌ కూడా ఉన్నట్లు గుర్తించారు. 

ఇవిగాక పెద్ద ఎత్తున వ్యవసాయ, రెవెన్యూ భూములు ఉన్నాయని, 20 రెవిన్యూ గ్రామాల్లో జనజీవనం కూడా ఉందని పేర్కొన్నారు. ఈ కారిడార్‌ను రాష్ట్ర అటవీ శాఖ నోటిఫై చేయాల్సి ఉరది. ఎలిఫెంట్‌ కారిడార్లను గుర్తించడం వల్ల ఏనుగుల సంరక్షణకు చర్యలు తీసుకోవడం సులభమౌతుందని అటవీశాఖాధికారులు చెబుతున్నారు. 

రెండు, అంతకన్నా ఎక్కువ ఉన్న ఏనుగుల నివాసాల మధ్య అనుసంధానం కోసం ఈ కారిడార్లు ఉపయోగపడుతాయని, అధికారికంగా ప్రకటించడం వల్ల మనుష్యులకు, ఏనుగులకు మధ్య ముఖాముఖి సంఘటనలను సాధ్యమైనంత మేర తగ్గించగలమని చెబుతున్నారు.