బియ్యం కొనుగోలులో కేసీఆర్ రూ 4,000 కోట్ల కుంభకోణం

మళ్ళీ కేసీఆర్ గెలిస్తే రాష్ట్రంలో వ్యవసాయం బంద్ అవుతుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ హెచ్చరించారు. ఎన్నికల్లో డబ్బు కోసమే కేసీఆర్ బియ్యం అమ్ముకుంటానని కేంద్రానికి లేఖ రాసినట్లు వెల్లడించారు. ఎన్నికల నిధుల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం బియ్యం అమ్మకానికి పెట్టి కస్టమ్ మిల్లర్ల నోట్లో మట్టి కొట్టే పని చేశారని ధ్వజమెత్తారు. 
 
పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు కిలో 4, 5 రూపాయలకి తక్కువకి అమ్మాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని చెబుతూ ఈ బియ్యం అమ్మకం ద్వారా రూ. 4 వేల కోట్ల మేర కమీషన్ దండుకోవాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. ఈ రూ 4,000 కోట్ల అవినీతి సొమ్ముతో 100 నియోజకవర్గాల్లో సుమారు రూ.40 కోట్లు చొప్పున ఖర్చు చేసి వచ్చే ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్‌‌‌‌ కుట్ర చేస్తున్నడని అరవింద్ వెల్లడించారు.
 
ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని వేలం వేసేందుకు పెట్టిన నిబంధనలు సాధారణ మిల్లర్లు పాల్గొనలేని విధంగా ఉన్నాయని అంటూ రూ 1,000 కోట్ల టర్నోవర్ ఉండాలని, రూ 100 కోట్లు లాభం ఉండాలనే నిబంధనలు పెట్టారని అరవింద్ గుర్తు చేశారు.  మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వేలం వేయాలని నిర్ణయించారని, అయితే టెండర్‌లో పాల్గొనేందుకు పౌరసరఫరాల శాఖ నిర్ణయించిన విధివిధానాలతో రైస్ మిల్లర్లకు అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఎంఎస్ పీ ధరకు బియ్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్రంలో మిల్లర్లు సిద్దంగా ఉన్నప్పటికీ టెండర్ల ద్వారా తమ మిల్లు సామర్థ్యం మేరకు ధాన్యం దక్కించుకుందామనుకున్న మధ్యతరగతి మిల్లర్లకు అసలు అందులో పాల్గొనే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. తెలంగాణలో సుమారు రెండున్నర వేలమంది ఉన్నారని చెబుతూ వారందరి కేసీఆర్ ప్రభుత్వం నోట్లో మట్టికొట్టిందని వెల్లడించారు.

 
రైస్ మిల్లర్లు వ్యాపారం బంద్ అయితే రైతులు రోడ్డుమీద పరిస్థితి నెలకొంటుందని బిజెపి నేత హెచ్చరించారు. మిల్లులను అప్ గ్రేడ్ చేసుకోమని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో చెప్పిందని తెలిపారు. లిక్కర్ స్కాంలు, డబ్బులు దండుకోవడం తప్ప ఏమీ చేయలేదు బీఆర్ఎస్ అంటూ అరవింద్ మండిపడ్డారు.  పంట కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం సుతిల్ నుంచి మార్కెటింగ్ వరకు నిధులిస్తే రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనంతో రైతులకు తీవ్ర నష్టం జరిగిందని ధ్వజమెత్తారు.
సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో చాలాచోట్ల ధాన్యం తడిసి ముద్దయిందని పేర్కొంటూ వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా రాష్ట్ర సర్కారు కనీసం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఎఫ్ సీఐకి గోదాంలు సరిపోవట్లేదని అబద్ధాలు చెప్తున్నరని అంటూ  ఎఫ్ సీఐ 7 లక్షల మెట్రిక్ టన్నుల స్టోరేజీ కోసం అద్దె తీసుకుంటున్నమని ముందే చెప్పిందని, అయినా బీఆర్ఎస్ సర్కారు ధాన్యం కొనుగోలు చేయలేదని ఆయన గుర్తు చేశారు.  రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కారణంగానే వర్షాలకు ధాన్యం తడిసిపోయిందని స్పష్టం చేశారు.
 
మక్కపంట వేయొద్దని ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెబుతుందని, మరోవైపు అవే మక్కలను దిగుమతి చేసుకోవాలని కేంద్రంపై ఆ పార్టీ ఎంపీ రంజిత్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారని ఎంపీ గుర్తు చేశారు. బియ్యం అమ్మకాలతో రూ. 4,000 కోట్ల కుంభకోణానికి తెర తీశారని ఆయన ఆరోపించారు. బియ్యం అమ్మకాలతో భారీ స్కాం చేయాలని కల్వకుంట్ల కుటుంబం ప్లాన్ చేస్తుందని విమర్శించారు. 
 
గద్దెపై రాబందులు బియ్యం అమ్ముకుంటున్నారని, గద్దె కింద పందికొక్కులు బియ్యం తింటున్నాయంటూ విరుచుకుపడ్డారు. బియ్యం బ్లాక్ మార్కెట్ దందాలో కేటీఆర్ మునిగిపోయారని ధ్వజమెత్తారు. నిజామాబాద్‌లో కవిత ఎక్కడ పోటీ చేసినా మూడో స్థానానికి పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రికి ధాన్యం అమ్మకాలపై అవగాహన లేదని అర్వింద్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.