గోకుల్ ఛాట్, లుంబినీ పార్కు పేలుళ్ళకు 16 ఏళ్ళు

 
* హైదరాబాద్ చరిత్రపై నెత్తుటి సంతకం
గోకుల్ ఛాట్, లుంబినీ పార్కుల్లో జరిగిన జంట పేలుళ్ళ ఘటనను భాగ్యనగర చరిత్రపై నెత్తుటి సంతకంలా భావించవచ్చు. సరిగ్గా 16 ఏళ్ల క్రితం ఇదే రోజు (ఆగస్ట్ 25, 2007) భాగ్యనగరం జంట బాంబు పేలుళ్లతో ఉలిక్కిపడింది. నగరంలోని లుంబినీ పార్క్, గోకుల్ చాట్‌ల్లో నిమిషాల వ్యవధిలోనే వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి.  
 
మొదటి పేలుడు లుంబినీ పార్క్ వద్ద రాత్రి గం.7.45 నిమిషాలకు జరగగా, రెండో పేలుడు గం.7.50 నిమిషాలకు గోకుల్ చాట్ వద్ద జరిగింది. దీంతో  భాగ్యనగర ప్రజలు భయభ్రాంతులతో పరుగులు పెట్టారు. బయటికి రాకుండా ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. ఈ ఘటనలో 42 మంది మృతి చెందగా, 300 మంది కి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 
 
హైదరాబాద్ మహానగరంతో పాటు దేశం మొత్తాన్ని ఈ జంట పేలుళ్ళ ఘటనలు షాక్‌నకు గురి చేశాయి.  బాంబుల్లో వినియోగించిన ఇనుప ముక్కల ధాటికి చాలామంది శరీర అవయవాలు కోల్పోయి జీవచ్ఛాలుగా మిగిలారు. వాస్తవానికి కోఠిలోని గోకుల్‌ చాట్‌ బండార్‌ అంటే తెలియనివారు ఉండరు. ఫాస్ట్ ఫుడ్ ప్రియులు చాలా మంది నిత్యం అక్కడికి వస్తుంటారు. 
 
దీంతో ఆ ప్రాంతం మొత్తం విపరీతమైన రద్దీగా ఉంటుంది. అలాగే, లుంబిని పార్క్‌ లో లేజర్‌ షో అంటే చాలా ప్రాచుర్యం పొందింది. అది చూసేందుకు చాలా మంది ప్రజలు వస్తుంటారు. ఎక్కడైతే ప్రజలు ఎక్కువగా ఉంటారో ఆ ప్రాంతాలనే టార్గెట్‌ చేసిన ఉగ్రవాదులు.. బాంబు దాడులతో దద్దరిల్లేలా చేశారు. 
 
పిల్లలు, పెద్దవారు అనే తేడా లేకుండా బాంబు బ్లాస్ట్‌లో అనేక మంది ప్రాణాలను బలి తీసుకున్నారు. బాంబు పేలుళ్ళలో గాయపడ్డ మరికొందరు జీవచ్ఛవాలుగా మిగిలిపోయారు. ఆ సంఘటన జరిగి నేటికి 16 సంవత్సరాలు అవుతున్నా.. అది తలచుకుంటూ.. కుటుంబంలో కోల్పోయిన వారిని గుర్తుచేసుకుంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. 
 
ఇక వరుస బాంబు పేలుళ్ళ అనంతరం గోకుల్‌ చాట్‌, లుంబిని పార్క్‌ రెండూ మూసివేశారు. ప్రవేశానికి అనుమతించకుండా కొద్ది రోజుల వరకు బంద్‌ చేశారు.  ఇండియన్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థ ఈ దారుణానికి పాల్పడింది. ఈ నరమేధానికి పాల్పడ్డ నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో న్యాయస్థానంలో 1125 పేజీలతో ఛార్జిషీటు దాఖలు చేశారు.
 
ఈ కేసులో 286 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. ఈ కేసు విచారణ కోసం చర్లపల్లి న్యాయస్థానంలో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేశారు. మక్కా పేలుళ్ల తర్వాత పోలీసుల కాల్పులకు ప్రతీకారంగా నిందితులు పేలుళ్లు జరిపినట్టు విచారన తేలింది. అన్ని ఆధారాలను పరిశీలించిన స్పెషల్ కోర్టు అనిక్ షఫిక్ సయ్యద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలకు ఉరిశిక్ష విధిస్తూ 2018లో తుదితీర్పు వెలువరించింది. 
 
వీరికి ఆశ్రయం ఇచ్చిన తారిఖ్ అంజుమాకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. నాటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి  బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చినా మొక్కుబడిగా సాయం అందించి చేతులు దులుపుకున్నారు. ఈ ఘటనలో నాటి యువ ఇంజనీర్లు, డాక్టర్లు కాలేజీ విద్యార్థులు, పలువురూ తమ శరీరంలో అవయవాలను కోల్పయి జీవచ్ఛవంలా నేటికి జీవితాన్ని నెట్టుకొస్తున్నారు.
 
 వీరికి అండగా ఉంటామన్న పాలకుల హామీలు నేటికీ ఆచరణకు నోచుకోక పోవటం దారుణం. ఆనాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు ఆ భగవంతుడు శాంతి కలిగించాలంటూ అనేక మంది హైదరాబాద్ ప్రజలు కోరుకుంటున్నారు.